మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 31 ఆగస్టు 2015 (13:59 IST)

హార్దిక్ పటేల్ పోరాటానికి.. చెల్లెలికి జరిగిన అన్యాయం కూడా ఓ కారణమట!

హార్దిక్ పటేల్ ఉద్యమ బాట ఎందుకు పట్టారు. గుజరాత్‌లోని పటేళ్లను ఓబీసీ కోటాలో చేర్చి రిజర్వేషన్లను కల్పించాలనే డిమాండ్‌తో ఆయన చేపట్టిన ఉద్యమం అటు రాష్ట్ర ప్రభుత్వానికే కాకుండా కేంద్ర ప్రభుత్వానికి సైతం ముచ్చెమటలు పట్టిస్తోంది. హార్దిక్ పటేల్ ఉద్యమంపై సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. ఈ నేపథ్యంలో అసలు హార్దిక్ పటేల్ సాగిస్తోన్న ఉద్యమానికి నాంది ఏమిటనే విషయంపై పలు కారణాలు వినిపిస్తున్నాయి. 
 
వాటిపై చర్చ కూడా సాగుతోంది. ఈ జాబితాలో మరో కారణం కూడా చేరిపోయింది. స్కాలర్ షిప్ విషయంలో తన సోదరికి జరిగిన అన్యాయం తనను ఆందోళన బాట పట్టించిందని హార్దిక్ ప్రకటించారు. తన పోరు బాటకు చాలా కారణాలున్నప్పటికీ, తన సోదరికి జరిగిన అన్యాయం కూడా అందులో ఒకటన్నారు. 
 
కాగా గుజరాత్‌లో పటేల్ సామాజిక వర్గానికి హార్దిక్ పటేల్ ఇప్పుడు హీరోగా మారిపోయాడు. తమ వర్గాన్ని ఓబీసీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ హార్దిక్ ఉద్యమబాట పట్టాడు. తమ డిమాండ్ నెరవేర్చకపోతే 2017 గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమని హెచ్చరిస్తున్నాడు. గుజరాత్ ప్రభుత్వానికి, బీజేపీ నాయకులకు ముచ్చెమటలు పట్టిస్తున్న హార్దిక్.. 21 ఏళ్ల పట్టభద్రుడు. 
 
అతనికి రాజకీయ నేపథ్యం లేకపోయినా.. గుజరాత్ రాజకీయ నేతలకు వణుకు పుట్టిస్తున్నాడు. మధ్యతరగతి కుర్రాడైనప్పటికీ అతడు పిలుపునిస్తే లక్షలాది మంది తరలి వస్తున్నారు. చదువులో టాపర్ కాదు కానీ వాగ్దాటిలో ప్రజలను ఆకట్టుకుంటున్నాడు.