టీచర్‌ను చూసి ఈల వేసిన స్టూడెంట్... కర్రలతో చితకబాదిన టీచర్స్
హర్యానా రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ టీచర్‌ను చూసిన ఈల వేసిన విద్యార్థులతో పాటు తరగతి గదిలోని 40 మంది విద్యార్థులను టీచర్‌తో మరో ఇద్దరు కలిసి కర్రలతో చావబాదారు. ఈ దారుణం ఈ నెల 6వ తేదీన జరిగింది.
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హర్యానాలోని తోహనా గవర్నమెంట్ సీనియర్ సెకండరీ స్కూల్ జరిగిన ఈ ఘటనపై విద్యార్థి ప్రీత్‌పాల్ సింగ్ మాట్లాడుతూ, 6వ తేదీన ఉదయం మా క్లాసులోకి ఓ టీచర్ వచ్చింది. ఆ టీచర్‌ను చూడగానే వెనుక బెంచ్‌లో ఉన్న ఓ విద్యార్థి విజిలేశాడు. ఆ టీచర్‌తో కోపంతో ఊగిపోయింది.
తరగతి గదిలోని 40 మందిని పాఠశాల ఆవరణలోకి పిలిపించింది. మరో ఇద్దరు టీచర్లతో కలిసి మమ్మల్ని కర్రలతో దారుణంగా కొట్టారు. కొందరికైతే రక్తం వచ్చింది. శరీరం వాచిపోయింది. నడుముతో పాటు ఇతర శరీర భాగాలపై ఇష్టమొచ్చినట్లు కర్రలతో బాదడంతో నడవలేని పరిస్థితి ఏర్పడింది. 10 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడటంతో ఆస్పత్రిలో చేరారు అని ప్రీత్‌పాల్ సింగ్ తెలిపాడు.
తమ పిల్లలను దారుణంగా కొట్టిన టీచర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణ అనంతరం టీచర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఐదు రోజుల్లో నివేదిక ఇవ్వాలని పోలీసులకు స్థానిక ఎస్పీ ఆదేశించారు.