శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By సెల్వి
Last Updated : శనివారం, 4 సెప్టెంబరు 2021 (14:53 IST)

Teachers' Day 2021 : 21 ఏళ్లకే ప్రెసిడెన్సీ కాలేజీలో లెక్చరర్.. ఆయనెవరు..?

Teachers Day
మాతృదేవోభ‌వ‌, పితృదేవోభ‌వ‌, ఆచార్యదేవోభవ తల్లిదండ్రుల తర్వాత అంతటి గొప్ప స్థానాన్ని గురువుకి భారతీయ సమాజం కల్పించింది. నేటి ఆధునిక కాలంలో మాత్రం గురువు అనే మాటకు నిలువెత్తు నిదర్శనంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ను చెప్పుకుంటారు.
 
తరాలు మారినా గురుస్థానం మారకూడదన్న తన ఆశయానికి అనుగుణంగా ఆ మహనీయుడు చేసిన సూచన భారతదేశ చరిత్రలో సెప్టెంబరు 5కి విశిష్ట స్థానాన్ని కల్పించింది. విద్యపై అపారమైన అనురక్తి కలిగిన డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ స్వయంగా అధ్యాపకుడు, విఖ్యాత దౌత్యవేత్త, పండితుడు. రెండుసార్లు భారత రాష్ట్రపతిగా సేవలందించారు.
 
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ తమిళనాడులోని తిరుత్తణి గ్రామంలో 1888 సెప్టెంబరు 5 న జన్మించారు. ఓ సాధారణ తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ఆయన విద్యాభ్యాసం అనేక ఒడిదుడుకుల మధ్య కొనసాగింది. కటిక పేదరికాన్ని అనుభవించిన సర్వేపల్లికి కనీసం చదువుకోవడానికి పుస్తకాలు కూడా ఉండేవి కావు. 
 
అలాంటి పరిస్థితుల్లో పుస్తకాలు కొనుక్కోగలిగిన స్థోమత ఉండి, కొనుక్కున్న వ్యక్తి ఇంటికి వెళ్లి ఆయనను ‘అయ్యా..ఒక్క కాగితం నలగకుండా నేను పుస్తకం చదువుకుంటాను. దయచేసి నాకు పుస్తకం ఇప్పించండి’ అని ప్రార్థించి పుస్తకాన్ని తెచ్చుకుని చదువుకునేవారు.
 
పుస్తకాలు ఉన్న వ్యక్తులు తనను ఎప్పుడు రమ్మంటే అప్పుడే వెళ్లి, వాటిని తెచ్చుకుని చదివి గొప్ప తత్వవేత్త అయ్యారు. తత్వశాస్త్రంపై మక్కువతో అదే ప్రధానాంశంగా మాస్టర్స్ డిగ్రీలో ‘ది ఎథిక్స్ ఆఫ్ వేదాంత’ను థీసిస్‌గా ఎంపిక చేసుకుని 20వ ఏటనే సమర్పించిన ప్రతిభాశాలి. 
 
21 ఏళ్లకే మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో లెక్చరర్‌గా చేరిన రాధాకృష్ణన్ ప్రతిభను గుర్తించిన మైసూరు విశ్వవిద్యాలయం ఆయనను తత్వశాస్త్ర విభాగం ప్రొఫెసర్‌గా నియమించింది. ఆ తర్వాత కలకత్తా విశ్వవిద్యాలయం, ఆంధ్ర విశ్వవిద్యాలయంలోనూ విధులు నిర్వహించారు.
 
నాలుగు దశాబ్దాల పాటు ఉపాధ్యాయవృత్తిలో ఉండి విద్యార్థుల మధ్యనే గడిపారు. ఎదుటివారికి బోధించటం వల్ల, తన విజ్ఞానం కూడా వృద్ధి చెందుతుందని బాగా నమ్మిన వ్యక్తి. వేలాది మంది విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన ఆయన తర్కం లాంటి కష్టమైన అంశాన్ని కూడా విద్యార్థులకు సులభంగా బోధించేవారు. 
 
ఆధునిక కాలంలో విద్యార్థికీ, ఉపాధ్యాయుడికీ మధ్య సంబంధం ఎలా ఉండాలో కూడా ఆచార్య రాధాకృష్ణన్ జీవితం అనేక పాఠాలను నేర్పుతుంది. ఆచార్యుడిగా, ఉపకులపతిగా, దౌత్యవేత్తగా, స్వాతంత్ర భారతావని తొలి ఉపరాష్ట్రపతిగా, రెండో రాష్ట్రపతిగా అధిరోహించిన శిఖరాలు, ఆయన జీవితంలోని అసాధారణ కోణాలను తెలియజేస్తున్నాయి.
 
చదువులో చురుకుగా ఉండే సర్వేపల్లి రాధాకృష్ణన్‌కు తల్లితండ్రులు ఉపనయనం చేశారు. ఇందులో భాగంగా ఆయన చెవులకు పోగులు పెట్టారు. ఇది జరిగిన అనంతరం తను చదువుకునే ఊరికి తిరిగి నడిచి వస్తున్నారు. పరీక్షకి రుసుం చెల్లించటానికి అదే చివరి రోజు. అలా వస్తున్న రాధాకృష్ణన్ ఒక దొంగ అడ్డగించి, దాడిచేసి చెవి పోగులు లాక్కున్నాడు. 
 
ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. దీంతో హడలిపోయిన సర్వేపల్లికి ఒళ్ళునొప్పులు, జ్వరం వచ్చింది. దీంతో పరీక్ష ఫీజు విషయం మర్చిపోయి పాఠశాలకు కూడా వెళ్లకుండా నిద్రపోయారు. ఇదే సమయంలో పరీక్ష ఫీజు చెల్లించని విద్యార్థులు ఎవరైనా ఉన్నారా? అని ప్రధానోపాధ్యాయుడు పరిశీలించారు.
 
అందులో రాధాకృష్ణన్ పేరు చూసి, "అయ్యో! చాలా బాగా చదువుకునే విద్యార్థి ఈరోజు రాకపోవడమేంటి? అని పరీక్ష రుసుం ఆయనే చెల్లించారు. ఆ తరువాత రాధాకృష్ణన్ పరీక్షల్లో తన ప్రతిభను నిరూపించుకున్నారు. 
 
ఉపాధ్యాయుడంటే ఎలా ఉండాలో చూసిన రాధాకృష్ణన్ ఈ సంఘటన తన జీవితంలో మర్చిపోలేదు. అందుకే ఒక ఉపాధ్యాయుడు ఒక వ్యక్తిని ఎంత ఎత్తుకు తీసుకెళ్లగలరో తెలుసుకుని, ఆచరించిన మహా పురుషుడు. అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన తత్వశాస్త్రవేత్త అయినా, రాష్ట్రపతి పదవిని అలంకరించినా, భారతరత్నను అందుకున్నా తన పుట్టినరోజును ఉపాధ్యాయ దినోత్సవం పరమ పవిత్రంగా చేయాలని కోరుకున్నారు.
Radhakrishnan
 
గురువు అంటే గు అంటే చీకటి, రువు అంటే వెలుగు నింపేవాడు.... అజ్ఞానం చీకట్లు తొలగించి, జ్ఞానజ్యోతిని వెలిగించేవాడని అర్థం. అందుకే భారతీయ పరంపర గురువుకు గొప్ప స్థానాన్ని కల్పించింది. ఆ గౌరవాన్ని నిలుపుకో వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేటి ఉపాధ్యాయులు సర్వేపల్లిని ఆదర్శంగా తీసుకుని, బాలలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.