గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 20 నవంబరు 2020 (20:00 IST)

ట్రయల్ కోవిడ్ వ్యాక్సిన్ తొలి వాలంటీరుగా హర్యానా మంత్రి! రూ.వెయ్యికే 'కోవిషీల్డ్' టీకా!

కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు సాధారణ ప్రజలకంటే.. రాజకీయ నేతలు హడలిపోతున్నారు. ముఖ్యంగా, అనారోగ్య సమస్యలతో బాధపడేవారు మరింతగా భయపడిపోతున్నారు. ఈ క్రమంలో హ‌ర్యానా ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్‌.. కోవాగ్జిన్‌ టీకా ట్ర‌య‌ల్ డోసు తీసుకున్నారు. అంబాలాలోని ఓ హాస్పిట‌ల్‌లో ఆయ‌న శుక్రవారం కోవిడ్ టీకాను వేయించుకున్నారు. 
 
హైద‌రాబాద్‌కు చెందిన భార‌త్ బ‌యోటెక్ సంస్థ కోవాగ్జిన్‌ టీకాను తయారు చేస్తోంది. అయితే శుక్రవారం కోవాగ్జిన్‌ మూడో ద‌శ ట్ర‌య‌ల్స్ దేశంలో ప్రారంభమయ్యాయి. ఈ నేప‌థ్యంలో హ‌ర్యానా మంత్రి అనిల్ విజ్.‌.. వాలంటీర్ రూపంలో కోవాగ్జిన్‌ టీకా వేయించుకున్నారు. 
 
మరోవైపు, వచ్చే యేడాది ఏప్రిల్ నాటికి ఆక్స్‌ఫర్డ్‌ కొవిడ్‌-19 కోవీషీల్డ్ వ్యాక్సిన్‌ ఆరోగ్య సంరక్షణ కార్మికులు, వృద్ధులకు అందుబాటులోకి వస్తుందని, ఏప్రిల్‌ నాటికి సాధారణ ప్రజలకు అందుబాటులోకి ఉంటుందని పూణేకు చెందిన సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సీఈఓ అదర్‌ పూణావాలా తెలిపారు. 
 
'హిందుస్థాన్‌ టైమ్స్‌ లీడర్‌ షిప్‌ సమ్మిట్‌-2020'లో ఆయన మాట్లాడుతూ, ప్రజలకు వ్యాక్సిన్‌ రెండు డోసులు రూ.1000కే అందుబాటులో ఉంటుందని చెప్పారు. తుది పరీక్షల ఫలితాలు, నియంత్రణ అనుమతులపైనే వ్యాక్సిన్‌ లభ్యత ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. 
 
ప్రతి భారతీయుడికి టీకాలు వేయడానికి రెండు నుంచి మూడేళ్ల సమయం పడుతుందని, 2024 నాటికి దేశంలోని ప్రతి ఒక్కరికీ టీకా వేయనున్నట్లు చెప్పారు. ఎందుకంటే సరఫరాలో అవరోధాలు, అవసరమైన బడ్జెట్‌, వ్యాక్సిన్‌, లాజిస్టిక్స్‌, మౌలిక సదుపాయాల కల్పన, ప్రజల సంసిద్ధత అవసరమన్నారు.