శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 30 అక్టోబరు 2020 (14:45 IST)

కరోనాతో కరిగిపోయిన నిధులు .. కుస్తీలు పట్టిన చేతులు మూటలు మోస్తున్నాయ్...

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ హహమ్మారి దెబ్బకు అనేక మంది జీవితాలు తలకిందులైపోయాయి. ఈ వైరస్‌కు ముందు ప్రతి ఒక్కరి జీవితం హాయిగా, సాఫీగా గడిచిపోతూ వచ్చింది. కానీ, ఈ వైరస్ ప్రవేశించిన తర్వాత పరిస్థితి ఒక్కసారి తలకిందులైపోయింది. ఫలితంగా అనేక మంది సొంత సంపాదనపై దృష్టిసారించారు. ఇందులోభాగంగా అనేకమంది తోపుడు బండ్లపై వ్యాపారం చేస్తుంటే మరికొందరు కిరణా కొట్లు పెట్టుకున్నారు. ఇంకొందరు మూటలు మోస్తూ, కూలీ పనులు చేసుకుంటూ బతుకు బండిని భారంగా లాగుతున్నారు. తాజాగా ఓ మల్లయుద్ధ వీరుడు (రెజ్లర్) తన భార్యాపిల్లలను పోషించుకునేందుకు మూటలు మోస్తున్నాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 26 ఏళ్ల సంగ్రామ్ అనే రెజ్లర్.. హర్యానా రాష్ట్రంలోని ఝజ్జర్‌లో పేరుమోసిన మల్లయుద్ధ యోధుడు. అతడి పట్టుకు ఎంతటి ప్రత్యర్థులైనా చిత్తు కావాల్సిందే. కుస్తీ పోటీల ద్వారా సంగ్రామ్‌ పెద్ద మొత్తంలో సంపాదించేవాడు. 
 
కానీ కొవిడ్‌ కారణంగా రెజ్లింగ్‌ పోటీలు జరగడంలేదు. దాచుకున్న డబ్బులు ఖర్చయ్యాయి. దాంతో భార్య, ఇద్దరు కూతుళ్లు, కుమారుడిని పోషించుకొనేందుకు సంగ్రామ్‌ కూలీగా మారాడు. 
 
'కుస్తీ పోటీల ద్వారా ఏడాదికి రూ.2.5 లక్షల పైగానే వచ్చేవి. కానీ, ఇప్పుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు బస్తాలు మోసినా నెలకు రూ.5 వేలు లభించడమే కష్టంగా ఉంది. ఐదుగురు సభ్యుల కుటుంబ పోషణకు ఈ మొత్తం సరిపోవడంలేదు' అన సంగ్రామ్ వాపోయాడు. 
 
కాగా, కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించే చర్యల్లో భాగంగా కేంద్రం గత మార్చి 25 నుంచి జూలై నెలాఖరు వరకు లాక్డౌన్ అమలు చేసింది. ఫలితంగా దేశవ్యాప్తంగా 750కిపైగా కుస్తీ పోటీలు ఆగిపోయాయి. దాంతో ఆ పోటీల్లో బరిలోకి దిగాల్సిన పేరు మోసిన రెజ్లర్లు రూ.40 కోట్లు నష్టపోయినట్టు సమాచారం.