1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 29 సెప్టెంబరు 2020 (15:23 IST)

పూరీ జగన్నాథ ఆలయం.. 400మంది సేవకులకు కరోనా.. 9 మంది మృతి

Puri Jagannath Temple
కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు చుక్కలు చూపిస్తోంది. దేశంలోనూ విలయతాండవం చేస్తోంది. తాజాగా సుప్రసిద్ధ ఒడిశాలో ప్రముఖ క్షేత్రం పూరీ జగన్నాథ ఆలయంలో 400మంది సేవకులు కరోనా వైరస్‌ బారినపడ్డారు. ఈ విషయాన్ని తాజాగా ఆలయ అధికారులు వెల్లడించారు. పూరీ దేవాలయాన్ని తిరిగి తెరవాలని భక్తుల నుంచి ఒత్తిడి పెరుగుతోన్న సమయంలో తాజా విషయం ఆందోళనకు గురిచేస్తోంది. మార్చి నెల నుంచి ఇక్కడ భక్తుల దర్శనాలను నిలిపివేశారు.
 
'పూరీ ఆలయంలో ఇప్పటివరకు మొత్తం 404 మందికి వైరస్‌ సోకింది. వీరిలో 351మంది సేవకులు ఉండగా, మరో 53మంది సిబ్బంది ఉన్నారు. వైరస్‌ బారినపడిన వారిలో ఇప్పటివరకు తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా, మరో 16 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు' అని జగన్నాథ ఆలయ పర్యవేక్షణ అధికారి అజయ్‌ కుమార్‌ జేనా వెల్లడించారు. 
 
వైరస్‌ సోకిన వారిలో ఎక్కువగా హోం ఐసోలేషన్‌లోనే ఉన్నట్లు అజయ్ కుమార్ తెలిపారు. ఇలాంటి సమయంలో పూజలు, ఆలయ నిర్వహణకు సిబ్బంది కొరత ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే, నిత్యం జరిగే పూజలు ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగుతున్నాయని ఆలయ పర్యవేక్షణాధికారి స్పష్టం చేశారు.
 
పూరీ రథయాత్ర అనంతరం 822 మంది ఆలయ సిబ్బందికి కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు జరిపించగా కేవలం ఇద్దరికి మాత్రమే వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. కానీ, తర్వాత ఆలయ సిబ్బందిలో వైరస్‌ విస్తృతంగా వ్యాపించింది. కేవలం ఒక్కనెల వ్యవధిలోనే 400మందికి సోకింది. ఇదే విషయాన్ని ఒడిశా ప్రభుత్వం రాష్ట్ర హైకోర్టుకు నివేదించింది. 
 
ప్రస్తుత పరిస్థితుల్లో ఆలయంలో భక్తుల సందర్శనకు అనుమతిస్తే మరింత మంది సేవకులు, సిబ్బంది వైరస్‌ బారినపడే అవకాశాలుంటాయని పేర్కొంది. అయితే, వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న దృష్ట్యా.. కరోనా నిబంధనలను సిబ్బంది తప్పకుండా పాటించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఆలయ పర్యవేక్షణ అధికారులు స్పష్టం చేశారు.