శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 11 నవంబరు 2018 (08:32 IST)

హైజాక్ అలారం నొక్కిన పైలట్... వణికిపోయిన ప్రయాణికులు..

పైలట్ తప్పిదం వల్ల విమానంలోని ప్రయాణికులతో పాటు.. భద్రతా సిబ్బంది కొన్ని నిమిషాల పాటు భయంతో వణికిపోయారు. ముఖ్యంగా, విమానం హైజాక్ అయిందన్న అనుమానంతో వారికి ముచ్చెమటలు పోశాయి. ఈ ఘటన శనివారం మధ్యాహ్నం ఢిల్లీ విమానాశ్రయంలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే,
 
ఢిల్లీ నుంచి కాందహార్‌కు వెళ్లే విమానం టేకాఫ్‌కు సిద్ధంగా ఉంది. ఆ సమయంలో ఉన్నట్టుండి హైజాక్ అలారం మోగింది. దీంతో ప్రయాణికులు భయంతో బెంబేలెత్తిపోయారు. అలారం మోగడంతో భద్రతా బలగాలు విమానాన్ని చుట్టుముట్టాయి. 
 
ఈ ఘటనపై ఎయిర్‌పోర్టు అధికారులు స్పందిస్తూ, ఢిల్లీ నుంచి కాందహార్‌కు వెళ్లే ఎఫ్.జి.-312 విమానం టేకాఫ్‌కు సిద్ధంగా ఉంది. అపుడు సరిగ్గా సమయం 3 గంటల 30 నిమిషాలు. ఆ సమయంలో విమానంలో 124 మంది ప్రయాణికులు, సిబ్బంది సహా 133మంది ఉన్నారు.
 
కొద్దిసేపట్లో విమానం గాలిలోకి ఎగురుతుందనగా హైజాక్ అలారం మోగింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. భద్రతా బలగాలు అప్పటికే విమానాన్ని చుట్టుముట్టాయి. అక్కడ ఏం జరుగుతుందో అర్థంకాక ప్రయాణికులు హాహాకారాలు చేశారు. 
 
కొద్దిసేపటికి స్పందించిన భద్రతా సిబ్బంది… ప్రమాదం ఏమీలేదని పైలెట్ పొరపాటున హైజాక్ అలారం బటన్ నొక్కాడని ప్రకటించారు. దీంతో ప్రయాణికులంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనతో విమానం రెండు గంటల ఆలస్యమయ్యింది.