శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 29 అక్టోబరు 2018 (19:39 IST)

ఢిల్లీకి చేరిన కోడి కత్తి నాటకం....

అమరావతి : ఏపీలో కోడికత్తి నాటకం వికటించడంతో వైసీపీ వారు సీన్‌ను ఢిల్లీకి మార్చారని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఎద్దేవా చేశారు. ఎవరి దర్శకత్వంలో వైసీపీ నాయకులు నాటకాలు ఆడుతున్నారో, వారి దగ్గరకే వెళ్లి మొరపెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి విమర్శించారు. ఏపీ ప్రజలు కోడికత్తి డ్రామాను నమ్మలేదని, ప్రతిపక్షనేత జగన్మోహన్ రెడ్డిపై దాడికి పాల్పడిన శ్రీనివాసరావును ముట్టుకోవద్దని వారించడం, దాడి జరిగిన వెంటనే కులాసాగా హైదరాబాద్ వెళ్లే విమానం ఎక్కడం, ఇవన్నీ పరిశీలిస్తే ఈ దాడి విషయం జగన్మోహన్ రెడ్డికి ముందే తెలసని మంత్రి కాల్వ శ్రీనివాసులు అభిప్రాయపడ్డారు. ప్రతిపక్షనాయకునిపై దాడి జరిగాక ముందుగా సీఎం చంద్రబాబునాయుడే ఖండించారని మంత్రి గుర్తు చేశారు. దాడి తరవాత బీజేపీ, వైసీపీ, టీఆర్ఎస్ నాయకులు అందరూ కలసి రాష్ట్ర ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేయడం దుర్మార్గమైన చర్య అని మంత్రి కాల్వ శ్రీనివాసులు దుయ్యబట్టారు.
 
కేంద్ర బలగాల అధీనంలో ఉండే విమానాశ్రయంలో ప్రతిపక్షనేతపై దాడి జరిగితే కనీసం పోలీసులు తీసుకునే చర్యలు కూడా తీసుకోలేదని ఆయన తప్పు పట్టారు. దాడి జరిగాక నవ్వుతూ విమానం ఎక్కి హైదరాబాద్ వెళ్లిన వ్యక్తి, అనంతరం సానుభూతి కోసం ప్రయత్నం చేయడం, దాడిని చిలువలు పలువలు చేసినా నాటకం రక్తి కట్టలేదని సీన్ ఢిల్లీకి మార్చారని, వారి పొలిటికల్ బాస్‌ల వద్దకు వెళ్లి రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవాలని చూస్తున్నారని మంత్రి ధ్వజమెత్తారు. 
 
వైసీపీతో ఈ నాటకం వేయించిన వారు ఇంకెన్ని కుట్రలకు తెర తీస్తారోనని అనుమానం వ్యక్తం చేశారు. దాడి తరవాత రాష్ట్ర ప్రభుత్వంపై జరిగిన కుట్రను మా నాయకుడు ఢిల్లీలో మీడియా ముందు కళ్లకు కట్టే విధంగా చెప్పడంతో అందరూ అవాక్కయ్యారన్నారు. ప్రతిపక్ష నేతకు రాష్ట్ర ప్రభుత్వంపై, పోలీసులపై నమ్మకం లేదని కనీసం ఫిర్యాదు చేయడానికి కూడా నిరాకరించారని, వైఎస్ఆర్ పార్టీకే చెందిన మాజీ పోలీసు అధికారి ఇక్భాల్ దర్యాప్తు అద్భుతంగా ఉందన్నారని, ఎవరి మాట నమ్మాలని మంత్రి కాల్వ శ్రీనివాసులు ప్రశ్నించారు. దాడి జరిగిన తీరు పోలీసులకు వివరించడానికి జగన్మోహన్ రెడ్డికి వచ్చిన ఇబ్బంది ఏమిటని మంత్రి ప్రశ్నించారు.
 
జగన్మోహన్ రెడ్డిపై దాడికి పాల్పడిన వ్యక్తి శ్రీనివాసరావు ఫోటోలు మార్ఫింగ్ చేయడం, అతనికి నకిలీ టీడీపీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని తప్పుల మీద తప్పులు చేస్తున్నారని మంత్రి కాల్వ శ్రీనివాసరావు తప్పు పట్టారు. నకిలీ గుర్తింపు కార్డులు సృష్టించడం నకిలీ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అని, వైసీపీ అంటేనే నకిలీ పార్టీ అని విమర్శించారు. దాడి చేసిన వ్యక్తికి ఇచ్చిన టీడీపీ గుర్తింపు కార్డు బాపట్ల నియోజకవర్గంలోని గణపవరం గ్రామానికి చెందిన అంకాలుదని మంత్రి మీడియాకు వివరించారు. శ్రీనివాసరావుకు టీడీపీతో లేని సంబంధాన్ని అంటగట్టాలని చూడటం నేరమని, దీన్ని ప్రజలు గమనిస్తున్నారని మంత్రి  గుర్తుచేశారు. దాడికి పాల్పడిన శ్రీనివాసరావు కుటుంబం మొత్తం వైసీపీ సానుభూతిపరులేనని మంత్రి తెలిపారు. 
 
ఒక తప్పును కప్పిపుచ్చుకునేందుకు మరో తప్పు చేస్తూ వైసీపీ ప్రజల ముందు దోషులుగా నిలబడ్డారని మంత్రి విమర్శించారు. ఇలాగే వెళితే వైసీపీ గల్లంతు కావడం ఖాయమన్నారు. అసత్యాలను, నిందారోపణలను, సత్యదూరమైన వాటిని వాస్తవాలుగా నమ్మించాలని చూడటం సాధ్యపడదని వైసీపీ నాయకులకు సూచించారు. దాడి జరిగిన మూడు గంటల తరవాత సీఐఎస్ఎఫ్ వారు కోడి కత్తి, లేఖ రాష్ట్ర పోలీసులకు అందించడం అనుమానాలకు తావిస్తోందన్నారు. 2900 కిలోమీటర్లు రాష్ట్రంలో ఎలాంటి ఘటనలు జరగకుండా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేయగలిగారంటేనే శాంతిభద్రతలు ఎలాగున్నాయో అర్ధం చేసుకోవచ్చన్నారు. అధికారం కోసం కొందరు, అభివృద్ధిని అడ్డుకోవాలని మరికొందరు ఏపీ ప్రభుత్వంపై అపవాదులు వేస్తున్నారని మంత్రి తప్పుపట్టారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిర పరచాలనే ఢిల్లీ కేంద్రంగా కుట్రజరుగుతోందని మంత్రి కాల్వ శ్రీనివాసులు అనుమానం వ్యక్తం చేశారు.