ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 18 మే 2018 (08:55 IST)

అపుడే ప్రజాస్వామ్యం ఖూనీ అయింది : అమిత్ షా

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత కాంగ్రెస్ - జేడీఎస్‌లు జట్టుకట్టినపుడే ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా వ్యాఖ్యానించారు. కర్ణాటక వ్యవహారంపై రాహుల్‌ ఘా

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత కాంగ్రెస్ - జేడీఎస్‌లు జట్టుకట్టినపుడే ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా వ్యాఖ్యానించారు. కర్ణాటక వ్యవహారంపై రాహుల్‌ ఘాటైన వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. వీటికి అమిత్ షా కౌంటరిచ్చారు.
 
'కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడికి బహుశా తమ పార్టీ 'ఘనమైన' చరిత్ర గురించి గుర్తులేదనుకుంటా. వారి పార్టీ చరిత్రంతా ఎమర్జెన్సీ, ఆర్టికల్‌ 356 దుర్వినియోగం, కోర్టులు, మీడియా, పౌరసమాజాన్ని వినాశనం చేయడంతో నిండి ఉంది' అని గుర్తుచేశారు. 
 
'కర్ణాటకలో ప్రజా తీర్పు ఎవరికి అనుకూలంగా ఉంది? 104 సీట్లు గెలిచిన బీజేపీకా? లేక 78 సీట్లకు పడిపోయిన కాంగ్రెస్‌ పార్టీకా?' అని ప్రశ్నించారు. యడ్డి సర్కారుకు బలనిరూపణకు గవర్నర్‌ 15 రోజులు సమయం ఇవ్వడాన్ని కాంగ్రెస్‌ ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడంగా అభివర్ణిస్తోందని మండిపడ్డారు. 'తన రాజకీయ ప్రయోజనాల కోసం జేడీఎస్‌కు కాంగ్రెస్‌ మద్దతిస్తామంటూ ఆఫర్‌ ఇచ్చిన క్షణమే ప్రజాస్వామ్యం హత్యకు గురైంది' అని ఘాటుగా స్పందించారు. 
 
కానీ, బీహార్, గోవా, నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల్లో బీజేపీ వ్యవహారించిన తీరుపై మాత్రం ఆయన ఏమాత్రం స్పందించలేదు. పైపెచ్చు.. బీహార్‌లో ఆర్జేడీ, మిగిలిన రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ బీజేపీ అడ్డదారుల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. వీటిపై మాత్రం అమిత్ షా స్పందించక పోవడం గమనార్హం.