శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , మంగళవారం, 17 జనవరి 2017 (03:19 IST)

యాదవ్ జూనియర్‌కి సైకిల్ బోనస్: రాహుల్ పంట పండేనా?

ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లో అఖిలేష్ ఇప్పుడు కొత్త టిప్పు సుల్తాన్ అయిపోయారు. సమాజ్ వాదీ పార్టీ అధికారిక చిహ్నం సైకిల్ ఆయన సొంతమయింది. దీంతో కిరీటం అలంకరించిన సుల్తాన్ అఖిలేష్ కాగా, పాతికేళ్లుగా యూపీ రాజకీయాలను శాసించిన పెద్దాయన ములాయం సింహాసనానికి దూరమ

మన కళ్లముందే ఒక వటవృక్షం నిలువునా కూలిపోయింది. ములాయం సీనియర్‌ని జూనియర్ యాదవ్ ఓడించేశారు. కనీసం ఎన్నికల గుర్తువరకైనా ఇది నిజమేనని చెప్పాలి. బండ్లు ఓడలయ్యాయో.. ఓడలు బండ్లయ్యాయో  తెలీదు కానీ అఖిలేష్ యాదవ్‌కి మాత్రం ఎన్నికల సంఘం సైకిల్ గుర్తును కేటాయించడం ద్వారా ఉత్తరప్రదేశ్ సమరాంగణంలో తొలి శుభశకునాన్ని అందించింది. 
 
ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లో అఖిలేష్ ఇప్పుడు కొత్త టిప్పు సుల్తాన్ అయిపోయారు. సమాజ్ వాదీ పార్టీ అధికారిక చిహ్నం సైకిల్ ఆయన సొంతమయింది. దీంతో కిరీటం అలంకరించిన సుల్తాన్ అఖిలేష్ కాగా, పాతికేళ్లుగా యూపీ రాజకీయాలను శాసించిన పెద్దాయన ములాయం సింహాసనానికి దూరమయ్యారు. 
 
సైకిల్ గుర్తు తన సొంతం అయిన వెంటనే నూతన నేతాజీగా అవతరించిన అఖిలేష్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు, తన మిత్రుడు అయిన రాహుల్ గాంధీతో పొత్తు కుదుర్చుకుంటామని చెప్పేశారు. ఆ వెంటనే తన పార్టీ తరపున ఎన్నికల  ప్రణాళిక ప్రకటించేశారు. అతడి క్యాంపు ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థులు యూపీ శాసనసభ ఎన్నికల ప్రచారంలో కేంపెయిన్‌కి దిగిపోయారు. ఈ సందర్భంగా అఖిలేష్ సన్నిహిత అభ్యర్థి ఒకరు మీడియాతో మాట్లాడుతూ సైకిల్ గుర్తు తమకు రావడం ఎన్నికల్లో దక్కిన బోనస్‌ అని ప్రకటించారు. 
 
సైకిల్ గుర్తు తన పరమైన వెంటనే మొత్తం పార్టీ అఖిలేష్ సొంతమైపోయింది. రాహుల్ గాంధీ కూడా వృద్ధ నేత ములాయం మాట మర్చిపోయి అఖిలేష్ యాదవ్‌తోనే పొత్తు కుదుర్చుకోవాలని సిద్ధమైపోయారు. త్వరలో యూపీలో అత్యంత భారీ స్థాయి బహిరంగ సభలో పొత్తు విషయం ప్రకటించనున్నారు కూడా. ఈ పొత్తు పరిణామంతో బీటలు వారిపోయిన యూపీ కాంగ్రెస్‌కి కొత్త జవసత్వాలు వస్తాయని అంచనా. ఇన్నాళ్లూ సింగిల్ డిజిట్ కూడా రావడం కరువైపోయిన కాంగ్రెస్ పార్టీకి ఈ పొత్తు ఊపిరిపోసినట్లేనని భావిస్తున్నారు. 
 
ములాయం స్థానంలో అఖిలేష్ నూతన పాలకుడిగా అవతరించిన తర్వాత అన్నిటికంటే లాభపడేది కాంగ్రెస్సేనని స్పష్టమవుతోంది. రాహుల్, అఖిలేష్  కూటమికి అదృష్టం తోడై ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో మెజారిటీ వచ్చినట్లయితే దేశ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు జరగడం మాటేమో కానీ, మోదీని ఢీకొట్టే బలమైన శక్తి ఇన్నాళ్లకు అవతరించిందన్నమాటే. 
 
ఇకపై నెల రోజులు దేశ చరిత్రను మలుపుతిప్పే గొప్ప పరిణామాలకు వేదిక కానున్నాయని స్పష్టమయింది. ఈ ఇద్దరు యువనేతల పొత్తు కొత్తమలుపును సృష్టించనున్నాయా అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి కాలం సిద్ధమయినట్లే మరి.