బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By జె
Last Modified: మంగళవారం, 1 ఫిబ్రవరి 2022 (19:06 IST)

ఉపాధ్యాయుడే కానీ కోటీశ్వరుడు, ఇంటి నిండా డబ్బు-నగలు

విద్యాబుద్ధులు నేర్పించే ఉపాధ్యాయుడు అతను. అందరితోను సరదాగా ఉంటాడు. హంగూ ఆర్భాటం ఎక్కడా చూపించడు. అయితే ఎసిబి అధికారులు ఆ ఉపాధ్యాయుడి ఇంట్లో సోదాలు చేసి స్వాధీనం చేసుకున్న డబ్బు, నగలు అంతాఇంతా కాదు. అసలు ఒక ఉపాధ్యాయుడికి ఇంత డబ్బులు ఎలా వచ్చాయంటే..?

 
ఒడిశా ఎసిబి అధికారులు రాయగడ జిల్లా కాశీపూర్ లోని శిశిర్ కుమార్ ఇంటిపైనా, అతని బంధువుల ఇంటిపైనా ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఇంట్లో 4 కోట్ల 16 లక్షల 99 వేల 477రూపాయల అక్రమ ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. తాను సంపాదించిన డబ్బు కంటే 307 రెట్లు ఎక్కువగా కూడబెట్టాడట శిశిర్ కుమార్. 

 
ఉపాధ్యాయుడి ఇంటితో పాటు అతని బంధువుల ఇంటిలో 6 చోట్ల ఏకకాలంలో దాడులు నిర్వహించి 2.88 లక్షల నగదు, దొరగూడ, రాయగడలో 2 మూడంతస్తుల భవనాలు, 3 రెండంతస్తుల భవనాలు, 22.34 లక్షల బ్యాంకు డిపాజిట్లు, 2 కార్లు, 408 గ్రాముల బంగారం, 229 గ్రాముల వెండి ఆభరణాలు లభించినట్లు తెలుస్తోంది. అంతేకాదు రైతులకు సంబంధించిన వందలాది ఎకరాలను కూడా ఉపాధ్యాయుడు కొనుగోలు చేశాడట. 

 
అయితే వీటికి సంబంధించిన లెక్కలు ఏ ఒక్కటి సరిగ్గా లేకపోవడంతో ఎసిబి ఆస్తులన్నింటినీ జప్తు చేసి శిశిర్ కుమార్‌ను అదుపులోకి తీసుకుందట. ఉపాధ్యాయుడి ఇంట్లో ఈ స్థాయిలో అక్రమ ఆస్తులు దొరకడం ఎసిబి అధికారులను ఆశ్చర్యపరుస్తోందట. ఉపాధ్యాయుడు అక్రమ ఆస్తులు సంపాదించాడా.. లేకుంటే ఎవరైనా బినామీగా ఉపాధ్యాయుడిని వాడుకుంటున్నారా అన్న కోణంలో విచారణ కొనసాగుతోంది.