1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 31 మే 2023 (11:52 IST)

దేవుడికే పాఠాలు చెప్పగల ఘనుడు ప్రధాని మోడీ : రాహుల్ గాంధీ

rahul gandhi
వారం రోజుల అమెరికా పర్యటనకు వెళ్లిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోమారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. ప్రజలను భయపెడుతున్న ప్రధాని మోడీ.. దేశంలోని అన్ని దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తుందని ఆరోపించారు. పైగా, దేవుడికే పాఠాలు చెప్పగల ఘనుడు ప్రధాని మోడీ అంటూ వ్యంగ్యాస్త్రాలుసంధించారు. 
 
కాలిఫోర్నియాలోని శాంటా క్లారాలో యూనివర్శిటీ ఆఫ్‌ కాలిఫోర్నియాలో హక్కుల కార్యకర్తలు, విద్యావేత్తలతో జరిగిన చర్చా కార్యక్రమంలో రాహుల్ పాల్గొన్నారు. అనంతరం ప్రవాస భారతీయులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం, ఆర్‌ఎస్‌ఎస్‌, ప్రధాని మోడీపై విమర్శలు ఎక్కుపెట్టారు. 
 
'అంతా తమకే తెలుసు అని ప్రజలను నమ్మించే వ్యక్తులు భారత్‌లో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. వారు శాస్త్రవేత్తలకే శాస్త్రాన్ని చెబుతారు. చరిత్రకారులకు చరిత్రను వివరిస్తారు. సైన్యానికి యుద్ధాన్ని నేర్పిస్తారు. వారు దేవుడితో కూర్చుంటే ఆయనకే పాఠాలు చెప్పగల సమర్థులు. ప్రధాని నరేంద్ర మోడీ అందుకు గొప్ప ఉదాహరణ. ఒకవేళ.. మోడీ ఆ భగవంతుడి పక్కన కూర్చుంటే.. ఈ ప్రపంచం ఎలా పనిచేస్తుందనే విషయాన్ని దేవుడికే చెప్పగలరు. అప్పుడు భగవంతుడు కూడా తాను సృష్టించిన విశ్వం ఇదేనా అని గందరగోళానికి గురవుతారు' అంటూ రాహుల్‌ ఎద్దేవా చేశారు.
 
పైగా, తాను భారత్ జోడో యాత్రను చేపట్టడానికి గల కారణాలను కూడా ఆయన వివరించారు. బీజేపీ ప్రభుత్వం ప్రజలను భయపెడుతోంది. ప్రభుత్వ దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. ప్రజలతో మమేకమయ్యేందుకు అవసరమైన అన్ని సాధనాలను బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ నియంత్రించిందని, ఒకప్పటి రాజకీయ వ్యూహాలు ఇక పనిచేయవని అర్థమైందన్నారు. అందుకే భారత్‌ జోడో యాత్రను చేపట్టా. నా యాత్రను అడ్డుకునేందుకు ప్రభుత్వం ఎంతగానో ప్రయత్నించింది. కానీ అవి ఫలించలేదు. మా యాత్రకు మరింత ఆదరణ దక్కింది. ఆ ప్రయాణంలో నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నట్టు రాహుల్ వివరించారు.