దేశ వ్యాప్తంగా 70 కోట్ల మందికి టీకాల పంపిణీ
కరోనా వైరస్ బారినపడకుండా ఉండేందుకు వీలుగా దేశంలో ముమ్మరంగా కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ సాగుతోంది. ఇందుకోసం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా, ఇపుడు సరికొత్త రికార్డును చేరుకున్నారు.
దేశంలో ఇప్పటివరకు 70 కోట్ల మందికి కరోనా టీకాలు వేశారు. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సూక్ మాండవీయ తెలిపారు. అయితే గడిచిన 13 రోజుల్లోనే 10 కోట్ల మంది కోవిడ్ టీకాలు ఇచ్చినట్లు మంత్రి వెల్లడించారు. తన ట్విట్టర్‌లో రియాక్ట్ అయిన మంత్రి.. ప్రధాని మోడీ నాయకత్వంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతున్నట్లు తెలిపారు.
ఈ ఘనత సాధించినందుకు హెల్త్ వర్కర్లకు, ప్రజలకు మంత్రి మాండవీయ థ్యాంక్స్ చెప్పారు. తొలి పది కోట్ల డోసులను 85 రోజుల్లో, 20 కోట్ల టీకాలను 45 రోజుల్లో, 30 కోట్ల డోసులను 29 రోజుల్లో, 40 కోట్ల డోసులను 24 రోజుల్లో, 50 కోట్ల డోసులను 20 రోజుల్లో, 60 కోట్ల డోసులను 19 రోజుల్లో, ఇక 70 కోట్ల డోసులను 13 రోజుల్లో ఇచ్చినట్లు మంత్రి వివరించారు.