1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 27 జులై 2025 (12:16 IST)

మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు ఘన నివాళులు

abdul kalam
భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న, మిస్సైల్ మ్యాన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. కలాం ఒక స్ఫూర్తిదాయక దార్శనికుడని, గొప్ప శాస్త్రవేత్త అని, ఆదర్శవంతమైన దేశభక్తుడని ప్రధాని కొనియాడారు. దేశ యువతకు ఆయన ఆలోచనలు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తూనే ఉంటాయని పేర్కొన్నారు. 
 
జూలై 27వ తేదీ ఆదివారం కలాం వర్థంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. "మన ప్రియతమ మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంకు ఆయన వర్ధంతి నాడు నివాళులర్పిస్తున్నాను. దేశం పట్ల ఆయనకున్న అంకితభావం ఆదర్శప్రాయం. అభివృద్ధి చెందిన, బలమైన భారత్‌ను నిర్మించేందుకు ఆయన ఆలోచనలు దేశంలోని యువతను ప్రేరేపిస్తాయి" అని మోడీ తన ట్వీట్‌లో పోస్ట్ చేశారు. రాష్ట్రపతి కాకముందే "రాష్ట్ర రత్న"గా ప్రజల మన్ననలు పొందిన అరుదైన వ్యక్తి కలాం అని గతంలో మోదీ ప్రశంసించిన విషయం తెలిసిందే. 
 
కాగా, భారతదేశ 11వ రాష్ట్రపతిగా 2002 నుంచి 2007 వరకు సేవలందించిన డాక్టర్ కలాం, నిరాడంబర జీవితం, నిష్పక్షపాత వైఖరితో ప్రజలందరి గౌరవాన్ని పొందారు. 'మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా'గా పేరుగాంచిన ఆయన, దేశ రక్షణ వ్యవస్థ బలోపేతానికి విశేష కృషి చేశారు. ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం నేతృత్వం వహించి అగ్ని, పృథ్వీ వంటి శక్తివంతమైన క్షిపణుల రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. 1998లో జరిగిన పోఖ్రాన్-II అణు పరీక్షల్లోనూ ఆయన ముఖ్య సమన్వయకర్తగా వ్యవహరించారు.
 
అలాగే, కలాం వర్ధంతి సందర్భంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా కూడా నివాళులర్పించారు. కలాం జీవితం అద్భుతమైన పోరాటానికి, విజయానికి నిదర్శనమని పేర్కొన్నారు. భారత్‌ను అణుశక్తిగా నిలపడంలో ఆయన అందించిన సేవలు మరువలేనివని నడ్డా అన్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందిస్తూ, కలాం జీవితంలోని నిరాడంబరత, దేశభక్తి యావత్ దేశానికే ప్రేరణ అని కొనియాడారు. ఆయన ఆలోచనలు శాస్త్ర, విద్యా రంగాలకు ఎప్పటికీ వెలుగునిస్తాయని తెలిపారు.
 
ప్రజల రాష్ట్రపతిగా గుర్తింపు పొందిన డాక్టర్ కలాం, యువతకు, విద్యార్థులకు స్ఫూర్తినివ్వడాన్ని ఎంతగానో ఇష్టపడేవారు. 2015 జులై 27న షిల్లాంగ్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తుండగా గుండెపోటుతో కుప్పకూలి తుదిశ్వాస విడిచిన విషయం తెల్సిందే.