ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 21 జూన్ 2022 (08:19 IST)

నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం - మైసూరులో ప్రధాని యోగాసనాలు

yoga day
జూన్ 21వ తేదీన ప్రతి యేటా అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఇందులోభాగంగా, కర్నాటక రాష్ట్రంలోని మైసూరులో జరిగే యోగా దినోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొని యోగాసనాలు వేస్తారు. ఇందుకోసం కర్నాటక ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. అలాగే ప్రధాని కర్నాటక పర్యటనను పురస్కరించుకుని మైసూర్ వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. 
 
మరోవైపు, ఈ యోగా వేడుకలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, శారీరక, మానసిక వికాసానికి దోహదపడే యోగాపై ప్రపంచ ప్రజలకు అవగాహన కల్పించేలా ఈ అంతర్జాతీయ యోగా వేడుకలను నిర్వహిస్తామన్నారు. 
 
సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో మంగళవారం జరిగే యోగా దినోత్సవ ఏర్పాట్లను ఆయన సోమవారం పరిశీలించారు. భారత్‌తోపాటు పలు దేశాల్లో యోగా వేడుకలు నిర్వహిస్తామని వెల్లడించారు. ప్రధాని నుంచి సర్పంచ్‌ వరకు యోగా వేడుకల్లో పాల్గొంటార న్నారు. కర్ణాటకలోని మైసూర్‌లో జరిగే యోగా వేడుకల్లో ప్రధాని మోడీ, కోయంబత్తూర్‌లో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పాల్గొంటారని తెలిపారు.
 
దేశవ్యాప్తంగా ఘన చరిత్ర కలిగిన 75 వారసత్వ కట్టడాల వద్ద జరిగే వేడుకల్లో కేంద్ర మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొంటారని కిషన్‌రెడ్డి వెల్లడించారు. సికింద్రాబాద్‌ పరేడ్‌గ్రౌండ్‌లో మంగళవారం ఉదయం 5.30 గంటలకు ప్రారంభమయ్యే యోగా వేడుకల్లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమానికి 50 వేల మంది వస్తారని అంచనా వేస్తున్నట్టు చెప్పారు.