శశికళ జైలు జీవితం ముగిసింది.. నేడే విడుదల.. డిశ్చార్జ్‌పై నిర్ణయం
అన్నాడీఎంకే బహిష్కృత నేత, జయలలిత నెచ్చెలి వీకే శశికళ జైలు జీవితం నేటితో ముగియనుంది. అవినీతి కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష అనుభవించిన ఆమెను ఈరోజు విడుదల చేయనున్నారు. ఇందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు ఆస్పత్రిలోనే పూర్తి చేయనున్నట్లు జైలు అధికారులు తెలిపారు. కరోనా బారిన పడ్డ శశికళ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విడుదలైన తర్వాత కూడా ఆమె ఆస్పత్రిలోనే ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం.
జనవరి 20న శశికళకు కరోనా సోకింది. ప్రస్తుతం విక్టోరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమెను ఎప్పుడు డిశ్ఛార్జి చేస్తారనే విషయంపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. ఆస్పత్రి వర్గాలతో చర్చించి డిశ్ఛార్జిపై నిర్ణయం తీసుకుంటామని శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ తెలిపారు.
ప్రస్తుతం శశికళ ఆరోగ్యం మెరుగ్గానే ఉందని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. కరోనా లక్షణాలు ఏవీ లేవని వెల్లడించారు. కరోనా మార్గదర్శకాల ప్రకారం ఇంకో పది రోజులు ఆస్పత్రిలో ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.