కోటాలో 18 ఏళ్ల జేఈఈ అభ్యర్థి ఆత్మహత్య.. రైల్వే ట్రాక్‌పై పడి.. ఐడీ కార్డు..?
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన 18 ఏళ్ల జేఈఈ అభ్యర్థి ఉజ్వల్ కోటలోని రాజీవ్ గాంధీ నగర్‌లో ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన జరిగింది. అతను గత రెండేళ్లుగా హాస్టల్‌లో ఉంటూ కోచింగ్ తరగతులకు హాజరవుతూ జేఈఈ పరీక్షకు సిద్ధమవుతున్నాడు.
ఈ నేపథ్యంలో కోటాలో రైల్వే ట్రాక్‌పై పడి ఉజ్వల్ ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఈ సంఘటన ఆదివారం సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో జరిగింది. ముంబై-ఢిల్లీ రైల్వే లైన్‌లో అతని ఐడి కార్డు, మొబైల్ ఫోన్ ద్వారా అధికారులు అతన్ని గుర్తించారు.
ఉజ్వల్ ఏప్రిల్ 2న లక్నోలో జేఈఈ మెయిన్స్ పరీక్ష రాయాల్సి ఉంది. అతని తండ్రి సోమవారం కోటాకు వెళ్లి పరీక్ష కోసం లక్నోకు తీసుకెళ్లాలని అనుకున్నాడు. అయితే, అది జరగకముందే, తన కొడుకు మరణ వార్త షాకిచ్చిందని అతని తండ్రి దీపక్ మిశ్రా తెలిపారు.
ఇంకా దీపక్ మిశ్రా మాట్లాడుతూ.. "విద్యార్థులు తరచుగా ఒత్తిడిని అనుభవిస్తున్నారని మేము గమనించాము, కానీ వారు దానిని వ్యక్తపరచలేకపోతున్నారు. నేను అతనిని తీసుకెళ్లడానికి వస్తున్నానని అతనికి చెప్పాను.." అని అన్నారు.
ఉజ్వల్ చివరిసారిగా తన తండ్రితో శనివారం రాత్రి 11 గంటలకు మాట్లాడినట్లు పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని జీఆర్పీ పోలీస్ స్టేషన్ ఎస్ఐ ధర్మ్ సింగ్ ధృవీకరించారు.