రైలులో మంటలు చెలరేగాయంటూ పుకార్లు : భయంతో కిందకు దూకిన ప్రయాణికులు.. ముగ్గురు మృతి!!
రైలులో మంటలు చెలరేగాయంటూ గుర్తు తెలియని వ్యక్తలుు పుకార్లు పుట్టించారు. దీంతో ప్రయాణికులు భయంతో వణికిపోయారు. వీరిలో కొందరు రైలు నుంచి దూకేశారు. అలాంటి వారిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని కుమన్‌డీహ్ రైల్వే స్టేషన్ పరిధిలో జరిగింది. రాంచీ - ససరామ్ ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు అంటుకున్నాయంటూ కొందరు పుకార్లు పుట్టించారు. దీంతో ముగ్గురు ప్రయాణికులు రైలు నుంచి కిందకు దూకేశారు.
ఇదే సమయంలో మరో ట్రాక్‌పై నుంచి వస్తున్న గూడ్సు రైలు వారిని ఢీకొట్టడంతో ఆ ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గత రాత్రి 8 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్టు రైల్వే అధికారులు తెలిపారు. రైలులో మంటలు చెలరేగాయని స్టేషన్ మాస్టర్‌కు ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి సమాచారం అందించాడు. దీంతో ఆయన రైలును ఆపివేశాడు. ఆ వెంటనే భయంతో ముగ్గురు ప్రయాణికులు ఒకే ట్రాక్‌పై దూకడంతో వారు ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఈ ఘటన వెనుక ఏదైనా లక్ష్యంగా ఉందా లేదా నక్సల్స్ చర్యా అన్న కోణంలో రైల్వే అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.