రాష్ట్రపతి పర్యటనలో అపశ్రుతి.. కాన్పూర్‌లో మహిళ మృతి
స్వగ్రామంలో రాష్ట్రపతి పర్యటన సందర్భంగా అపశ్రుతి చోటుచేసుకుంది. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా శుక్రవారం రాత్రి కాన్పూర్‌లో ట్రాఫిక్‌ను నిలిపివేయడంతో ఆ ట్రాఫిక్‌లో చిక్కుకున్న ఓ మహిళ అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయింది.
అఖిలభారత పరిశ్రమల సమాఖ్య కాన్పూర్ చాప్టర్ మహిళా విభాగం చీఫ్ వందన మిశ్రా(50) ఇటీవల కోవిడ్ నుంచి కోలుకున్నారు. శుక్రవారం రాత్రి ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో ఆమెను కాకాదేవ్‌లో ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్తున్నారు. వారి వాహనం వెళ్తున్న గోవింద్‌పురీ వంతెన మార్గంలోనే రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వాహన శ్రేణి వెళ్తోంది.
ప్రోటోకాల్‌లో భాగంగా ఆ మార్గంలో ట్రాఫిక్‌ను పోలీసులు ఆపడంతో భారీ ట్రాఫిక్‌జామ్ ఏర్పడింది. అందులో వందన వాహనం చిక్కుకుంది. కాన్వాయ్ వెళ్లాక వందనను ఆస్పత్రికి తరలిలించగా అప్పటికే ఆమె మరణించారు. ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం స్పందించింది.
ఘటనకు కారకులంటూ ఒక సబ్-ఇన్‌స్పెక్టర్, ముగ్గురు హెడ్ కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసినట్లు కాన్పూర్ అదనపు డిప్యూటీ కమిషనర్ అసీమ్ అరుణ్ చెప్పారు. ఘటనపై క్షమాపణలు చెప్పారు. మృతి విషయం తెల్సి రాష్ట్రపతి కోవింద్ ఆవేదన వ్యక్తం చేశారని చెప్పారు. అంత్యక్రియలకు హాజరై రాష్ట్రపతి తరఫున సానుభూతిని పోలీస్ కమిషనర్ తెలిపారు.