శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 17 సెప్టెంబరు 2019 (15:12 IST)

బీజేపీ దళిత ఎంపీకి అవమానం : దైవ దర్శనాన్ని అడ్డుకున్న యాదవులు

కర్నాటక రాష్ట్రంలో అధికార బీజేపీ ఎంపీకి ఘోర అవమానం జరిగింది. ఆయన దళితుడు కావడమే ఈ అవమానానికి ప్రధాన కారణం. ఈ దళిత ఎంపీ తమ ప్రాంతంలో అడుగుపెట్టడానికి వీల్లేదంటూ ఆ యాదవులంతా ముక్తకంఠంతో కోరారు. దీంతో ఆ బీజేపీ దళిత ఎంపీ మిన్నకుండిపోయారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, కర్నాటక రాష్ట్రానికి ఏ.నారాయణస్వామి బీజేపీ ఎంపీగా ఉన్నారు. ఈయన దళిత సామాజిక వర్గానికి చెందిన నేత. నియోజకవర్గ పర్యటనలో భాగంగా ఆయన తుమకూరులోని యాదవుల గుడిలోకి వెళ్లి దర్శనం చేసుకుందామనుకున్నారు. కానీ అతడిని ఆ కులస్తులు గుళ్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. 
 
ఈ సంఘటనపై నాగరాజు అనే వ్యక్తి స్పందిస్తూ, మేమంతా చాలా సాంప్రదాయవాదులం. మా గుడికి ఎంతో ప్రత్యేకత ఉంది. అణగారిన వర్గానికి చెందిన వ్యక్తి గుడిలో అడుగు పెడితే కీడు జరుగుతుందని కుల పెద్దలు చెప్పడంతో అతడిని గుళ్లోకి రానివ్వలేమని అన్నారు.
 
ఈ సంఘటనపై ఎంపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కాగా, భారతదేశం కుల, మతాల సమ్మేళనం, భిన్నత్వంలో ఏకత్వం అనేవి ఉట్టి మాటలేనని మరోసారి రుజువైంది. పార్లమెంట్‌ మెంబర్‌కే ఇలాంటి అవమానం జరిగినపుడు గ్రామాల్లో సాధారణ ప్రజల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి పరిస్థితి దేశంలో ఇకనైనా మారాలని ఆశిద్దాం అంటూ వ్యాఖ్యానించారు.