కర్నాటకలో యడ్యూరప్ప మంత్రివర్గం.. బూతు బొమ్మలు చూసినోళ్ళకి ఛాన్స్
గత నెల 26వ తేదీ నుంచి వన్‌మ్యాన్ క్యాబినెట్ నడుపుతున్న కర్నాటక ముఖ్యమంత్రి బి.ఎస్. యడ్యూరప్ప మంగళవారం 17 మందితో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వరదలు తదితర కారణాల వల్ల మంత్రివర్గం ఏర్పాటు చేయలేదనిపైకి చెబుతున్నా కేంద్ర పార్టీ నుంచి క్లియరెన్సు లేకపోవడం వల్లే ఈ జాప్యం జరిగిందనేది బహిరంగ రహస్యం.
గత మైత్రి ప్రభుత్వాన్ని వీడి బిజేపికి మద్దతిచ్చిన స్వతంత్ర అభ్యర్థి హెచ్.నగేశ్‌కు కేబినెట్‌లో బెర్త్‌ను యడ్యూరప్ప ఖరారు చేశారు. 17 మంది కొత్త మంత్రులలో ఎక్కువ మంది లింగాయత్‌లే ఉండటం గమనార్హం. కొత్త వారికి ఛాన్స్ ఇవ్వాలని అధిష్టానం వత్తిడి తీసుకురావడం వల్ల ఐదుగురు కొత్త వారికి మంత్రి వర్గంలో స్థానం దక్కింది.
మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్న వారిలో గోవింద్ కర్జాల్, కె.ఎస్.ఈశ్వరప్ప, ఆర్.అశోక్, డాక్టర్ సి.ఎన్. అశ్వంత్ నారాయణ్, లక్ష్మన్ సవేదీ, జగదీష్ షెట్టర్, బి.రాములు, ఎస్.సురేష్ కుమార్, వి.సోమన్న, సి.టి.రవి, బస్వరాజ్ బొమ్మయ్, కోట నివాస్ పూజారి, జెసి మధుస్వామి, సి.సి.పాటిల్, ప్రభు చౌహాన్, శశికళా జోల్లే వీరంతా బిజెపి కి చెందిన వారు కాగా హెచ్.నగేష్ స్వతంత్ర ఎమ్మెల్యే కావడం గమనార్హం. సవేదీ, సి.సి.పాటిల్ యడ్యూరప్ప గత మంత్రి వర్గంలో కూడా సభ్యులు. విధాన సభలో బూతు బొమ్మలు చూసినందుకు వీరిద్దరూ అప్పటిలో రాజీనామాలు చేశారు.