సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 16 ఆగస్టు 2023 (11:27 IST)

బీజేపీకి సవాల్‌గా మారిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు

election commission of india
దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికలను మినీ సమరంగా భావిస్తారు. ఇవి భారతీయ జనతా పార్టీకి అత్యంత సవాలుగా మారాయి. వచ్చే యేడాది లోక్‌సభ ఎన్నికలకు ముందు ఈ ఎన్నికలు జరుగుతుండటంతో వీటిని సెమీ ఫైనల్‌గా భావిస్తారు. ఇటీవల కర్నాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చిత్తు చిత్తుగా ఓడిపోయింది. అంతకుముందు కూడా హిమాచల్ ప్రదేశ్, బిహార్ వంటి రాష్ట్రాల్లో ఎదురుదెబ్బలు తగిలిన నేపథ్యంలో ఈ ఎన్నికలను కమలం పార్టీ ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. 
 
ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో అత్యధిక రాష్ట్రాలను కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. ఈ ఎన్నికల్లో ఏమాత్రం తేడా వచ్చినా.. అది లోక్‌సభ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో సర్వశక్తులూ ఒడ్డి పోరాడాలని బీజేపీ అగ్రనేతలు నిర్ణయించారు. 
 
ఆయా రాష్ట్రాల్లో అధికారం సాధించడమే లక్ష్యం కావాలని, ఒకవేళ అధికారం దక్కకపోతే సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు సాధించాలని పార్టీ అధిష్టానం నిర్ణ యించింది. తద్వారా కర్ణాటక ఎన్నికల తర్వాత బీజేపీ బలహీనపడిందనే ప్రచారాన్ని తిప్పికొట్టాలని భావిస్తోంది. ఈ ఎన్నికల ఫలితాల్లో ప్రజల నాడి తెలిసిన తర్వాతే సార్వత్రిక ఎన్నికలకు, ఇతర రాష్ట్రాల ఎన్నికలకు వ్యూహాన్ని బహిరంగంగా వెల్లడించే అవకాశం ఉంది.