శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 23 జులై 2019 (08:27 IST)

కర్నాటకం క్లైమాక్స్‌కు... నేడే తుది అంకం

కర్నాటకం క్లైమాక్స్‌కు చేరింది. అసెంబ్లీలో విశ్వాస పరీక్ష చర్చ ముగింపు దశకు చేరుకుంది. తక్షణమే బలపరీక్ష నిర్వహించాలని బిజెపి సభ్యులు ఆందోళన చేస్తుండగా రాత్రి 11.40గంటల సమయంలో స్పీకర్‌ రమేష్‌కుమార్‌ మంగళవారానికి సభను వాయిదా వేశారు. మంగళవారం సాయంత్రం ఆరులోగా బలపరీక్ష నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు. స్పీకర్‌ ఈ ప్రకటన చేసిన సమయంలో సభలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు లేరు. 
 
బిజెపి శిబిరంలో అలజడి
అంతకుముందు భోజనానికి వెళ్లిన బిజెపి ఎంఎల్‌ఎ ఉమేష్‌ కత్తి తిరిగి రాకపోవడంతో ప్రతిపక్ష బిజెపి శిబిరంలో అలజడి రేగింది. ఆయనను వెతకడం కోసం మరో బిజెపి ఎంఎల్‌ఎ బొమ్మై బసవరాజు వెళ్లారు. విశ్వాస పరీక్షపై సభ్యులందరూ మాట్లాడాక గురువారం ఓటింగ్‌ నిర్వహిద్దామని స్పీకర్‌ రమేష్‌ కుమార్‌ చేసిన సూచనను ప్రతిపక్ష బిజెపి తిరస్కరించడంతో సభలో కొద్దిసేపు ఉద్విగత నెలకొంది. చర్చ ముగిసాక ఓటింగ్‌ జరపాల్సిందేనని, దీనిపై ఇంకెంత మాత్రం జాప్యం తగదని బిజెపి సభ్యులు ఆందోళనకు దిగడంతో సభలో గందరగోళం నెలకొంది. రాత్రి 11.30 గంటల వరకూ ఓటింగ్‌పై సస్పెన్స్‌ కొనసాగింది. 
 
పార్టీల హక్కును కాలరాసే ప్రయత్నం..
సోమవారం మధ్యాహ్నం విశ్వాస తీర్మానంపై చర్చ జరిగే ముందు స్పీకర్‌ సిఎల్‌పి నాయకుడు శుక్రవారం లేవనెత్తిన పాయింట్‌ ఆఫ్‌ ఆర్డర్‌పై రూలింగ్‌ ఇస్తూ సిఎల్‌పి నాయకుడికి విప్‌ జారీచేసే అధికారం ఉందని చెప్పారు. రాజకీయ పార్టీల హక్కును కాలరాసే ప్రయత్నం తాను చేయబోమని చెప్పారు. ఆ తరువాత మంత్రి కృష్ణ బైరేగౌడ మాట్లాడుతూ గత 14నెలల్లో కర్ణాటకలో అడ్డదారుల్లో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు బిజెపి చేసిన కుటిల ప్రయత్నాలను, శాసనసభ్యుల కొనుగోళ్లను సవివరంగా ప్రస్తావించి నైతికత గురించి బిజెపి చెప్పేది వట్టి బూటకమని ఎండగట్టారు. 
 
విధానసభ భోజన విరామానికి వాయిదా పడే వరకు కృష్ణ బైరేగౌడ తమ పార్టీ శాసన సభ్యులను ముంబయికి ఎవరు తరలించారో, ఏయే విమానాల్లో తరలించారో ఉదాహరణలతో పోస్టర్లను, ఆధారాలను ప్రదర్శించారు. తమ శాసనసభ్యుల రాజీనామా ఇంకా అంగీకారం కాకపోవటంతో వారంతా కాంగ్రెస్‌ జెడిఎస్‌ పార్టీల సభ్యులని చెప్పారు. కాంగ్రెస్‌ సభ్యుల రాజీనామాలపై స్పష్టత వచ్చేవరకూ విశ్వాస పరీక్షను వాయిదా వేయాలని కోరారు. 
 
భోజన విరామం తరువాత సమావేశమైన శాసనసభ తమకు తీర్మానంపై చర్చించేందుకు తగినంత సమయం కేటాయించాలని స్పీకర్‌కు మనవిచేశారు. ఈమధ్యలో స్పీకర్‌ను రెండుసార్లు కలుసుకున్న ముఖ్యమంత్రి కుమారస్వామి తనకు మరో రెండురోజులు గడువు కావాలని, ఆ తరువాతనే బలపరీక్ష జరుపుదామని మనవి చేశారు. రాత్రి 9.00గంటల్లోపు సభను ముగించి బలపరీక్ష జరుపుతానని స్పీకర్‌ పట్టుబట్టారు. గత శుక్రవారం తాను సభలో వచ్చే సోమవారంవిశ్వాసపరీక్షపై చర్చను పూర్తిచేసి బలపరీక్షకు అనుమతిస్తామని చెప్పినట్లు గుర్తు చేశారు. 
 
దీనిని అమలు చేయకపోతే మాట తప్పినవాడిని అవుతానని స్పీకర్‌ చెప్పారు. స్పీకర్‌ నిర్ణయం ప్రకటించేటప్పుడు పాలకపక్షాల సభ్యులు నినాదాలు ఇస్తూ చర్చపై తమకు అనుమతి ఇచ్చి న్యాయం కల్పించాలని నినాదాలు ఇచ్చారు. స్పీకర్‌ వెల్‌లో ధర్నా చేశారు. దీంతో స్పీకర్‌ సభను 10నిమిషాలపాటు వాయిదా వేశారు. తరువాత రాత్రి 8.30గంటలకు సమావేశాలు ప్రారంభమయ్యాయి. వెంటనే ప్రతిపక్ష నాయకుడు యడ్యూరప్ప సోమవారం అర్ధరాత్రి 12.00 గంటల వరకు సమావేశం జరిపి తీర్మానంపై బలపరీక్షలు జరపాలని డిమాండ్‌ చేశారు. 
 
ముఖ్యమంత్రి జోక్యం చేసుకుంటూ తాను సిఎం కుర్చీకి అంటుకుని కూర్చోలేదని, కర్ణాటకలో బిజెపి జరిపిన అసహ్యకర రాజకీయాల గురించి సంపూర్ణంగా చర్చ జరగాలనే సభను మంగళవారానికి వాయిదా వేయాలని కోరారు. ఆతరువాత కూడా సమావేశం కొనసాగింది. రాత్రి 11.40 గంటల ప్రాంతంలో సభను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు. ఉదయం నుంచి చర్చ కొనసాగిస్తామని, 4గంటలకు బల పరీక్ష ప్రారంభించి 6గంటలకు ముగిస్తామని చెప్పారు.
 
రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిన అవసరం : స్పీకర్‌ 
దేశంలో ఇప్పుడున్న భ్రష్టుపట్టిన రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పీకర్‌ రమేష్‌ కుమార్‌ చెప్పారు. దేశ పార్లమెంట్‌ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన కమ్యూనిస్ట్‌ అగ్రనాయకులు పుచ్చలపల్లి సుందరయ్య, మాకినేని బసవపున్నయ్య, జ్యోతిబసు, ఎకె. గోపాలన్‌... తదితరులు తమ త్యాగాల ద్వారా దేశ ప్రజాస్యామ్య వ్యవస్థకు వన్నె తెచ్చారని చెప్పారు. పుచ్చలపల్లి సుందరయ్య తన పేరులోని రెడ్డి ఉప నామాన్ని తొలగించి ప్రజాస్వామ్యవాదిగా నిలిచారని చెప్పారు. తనకు బిడ్డలు కలిగితే ఎక్కడ తమ ప్రజాసేవకు ఆటంకం కలుగుతుందోనని కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స చేయించుకున్న విషయాన్ని స్పీకర్‌ గుర్తుచేశారు. 
 
ఇలాంటి నిస్వార్థ నాయకుల త్యాగాలను కర్ణాటక చట్టసభ నిలువునా పాతరవేసి స్వార్థపూరిత రాజకీయాలను నడుపుతోందని చెప్పారు. ప్రతిపక్ష నేతలుగా పైన పేర్కొన్న నాయ కులు ఏనాడూ అడ్డదారుల్లో ప్రజాస్వామ్యానికి ద్రోహం చేయలేదని చెప్పారు. ఇలాంటి నాయకులు ఇప్పుడు మచ్చుకైనా కనిపించటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.