1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 14 ఏప్రియల్ 2025 (23:20 IST)

చిన్నారిపై హత్యాచారం చేసిన నిందితుడి ఎన్‌కౌంటర్: PSI అన్నపూర్ణకు అభినందనలు

PSI Annapurna
కర్ణాటకలోని హుబ్బళ్లిలో ఐదేళ్ల చిన్నారిపై అత్యాచార యత్నం చేసి హత్య చేసిన నిందితుడు రితేశ్‌ని PSI అన్నపూర్ణ ఎన్‌కౌంటర్ చేసారు. చిన్నారిపై అఘాయిత్యం చేసేందుకు యత్నించి హత్య చేసాక అతడు పారిపోతుండగా PSI అన్నపూర్ణతో సహా పోలీసులు అతడిని వెంబడించారు. ఈ క్రమంలో అతడు పోలీసులపై రాళ్లు రువ్వడం ప్రారంభించాడు. ఐతే అతడిని లొంగిపోమని అన్నపూర్ణ పెద్దగా కేకలు వేసినా అతడు పట్టించుకోకుండా పోలీసులపై రాళ్లు రువ్వాడు. దీంతో అన్నపూర్ణ అతడిపై కాల్పులు జరపగా బుల్లెట్లు తగిలి అతడు హతమయ్యాడు.
 
పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్ (పీఎస్ఐ) అన్నపూర్ణను రాష్ట్ర అత్యున్నత పతకానికి సిఫార్సు చేస్తానని మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్ సోమవారం అన్నారు. బెల్గాంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ..., పీఎస్ఐ అన్నపూర్ణ చేసిన పనిని నేను అభినందిస్తున్నాను. ఆమెను అత్యున్నత పురస్కారంతో సత్కరించాలని ముఖ్యమంత్రిని, హోంమంత్రి డాక్టర్ జి. పరమేశ్వరకు సిఫార్సు చేస్తానని అన్నారు. ఆమె ధైర్యసాహసాలకు తను వ్యక్తిగతంగా అభినందిస్తున్నట్లు తెలిపారు.
 
మహిళలపై హింసకు సంబంధించిన నేరాలలో కఠినంగా శిక్షించాలనే తన దీర్ఘకాల డిమాండ్‌ను మంత్రి పునరుద్ఘాటించారు. ఇటువంటి కేసుల్లో నిందితులను ఉరితీయాలి. బాధితులకు త్వరిత న్యాయం జరగాలని ఆమె అన్నారు, పీఎస్ఐ అన్నపూర్ణ చేసిన చర్య రాష్ట్రంలోని ఇతర అధికారులకు ఒక ఉదాహరణగా ఉండాలని అన్నారు.