శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 18 సెప్టెంబరు 2021 (14:48 IST)

రెండేళ్ల పసిపాప.. 5 రోజుల పాటు శవాల మధ్యనే.. ఆకలితో 9 నెలల శిశువు..?

ఓ రెండేండ్ల పసిపాప.. ఐదు రోజుల పాటు శవాల మధ్యే ఉండిపోయింది. మరో 9 నెలల శిశువు మాత్రం ఆకలితో చనిపోయింది. ఈ విషాద ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో వెలుగు చూసింది. బెంగళూరులోని తిగళరపాళ్య చేతన్ ఏరియాలో శంకర్ కుటుంబం నివసిస్తోంది. శంకర్‌కు భార్య, ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగ పిల్లాడు సంతానం. కాగా 30 ఏండ్ల వయసున్న ఇద్దరు ఆడ పిల్లలకు వివాహమైంది. కుమారుడి వయసు 27 ఏండ్లు. అయితే పెద్ద కూతురు కాన్పు కోసం కొన్ని నెలల క్రితం పుట్టింటికి వచ్చింది. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆమెకు 2 ఏండ్ల కూతురు కూడా ఉంది.
 
కాన్పు అయి నెలలు గడుస్తున్నప్పటికీ పెద్ద కూతురు అత్తగారింటికి వెళ్లలేదు. అత్తగారింటికి వెళ్లాలని తండ్రి కూడా ఆమెకు చెప్పాడు. తన అత్తమామలతో సమస్యలు ఉన్నాయని, కొన్నాళ్లు ఇక్కడే ఉంటానని పెద్ద కూతురు చెప్పింది. తన మాట ఎవరూ వినడం లేదని తండ్రి శంకర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఐదు రోజుల క్రితం బంధువుల ఇంటికి వెళ్లాడు.
 
తన బంధువుల ఇంటికి వెళ్లిన శంకర్.. ఇంటికి ఫోన్ చేశాడు. కుటుంబ సభ్యులెవరూ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. అనుమానం వచ్చినా అతను ఐదు రోజుల తర్వాత ఇంటికి తిరిగి వచ్చాడు. తలుపులు తెరిచి చూడా భార్య, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉరేసుకున్న ఆనవాళ్లు కనిపించాయి. పెద్ద కూతురు కొడుకు(9 నెలల శిశువు) ఆకలితో చనిపోయాడు. 2 ఏండ్ల పసిపాప స్పృహా కోల్పోయింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.