మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 31 జులై 2023 (10:04 IST)

తిరుచ్చి లోక్‌సభ నుంచి నటి ఖుష్బూ పోటీ?

khushbu
వచ్చే యేడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ కార్యనిర్వాహక కమిటీ సభ్యురాలు, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు, నటి ఖుష్బూ తిరుచ్చి నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. లోక్‌సభ ఎన్నికలకు అన్ని పార్టీల కంటే ముందుగానే బీజేపీ ముమ్మర ప్రచారాన్ని ప్రారంభించడంతోపాటు, పార్టీ గెలుపునకు అవకాశాలున్న నియోజకవర్గాలను ఇప్పటికే గుర్తించినట్టు సమాచారం. 
 
గత లోక్‌సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమిలోని బీజేపీ ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేసి ఓటమిపాలైంది. ఈసారి కనీసం పది లోక్‌సభ నియోజకవర్గాల్లో పోటీ చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై నిర్ణయించారు. ఈ విషయమై పార్టీ అధిష్టానంతో ప్రత్యేకించి కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చర్చించారు. 
 
పది నియోజకవర్గాల్లో పోటీ చేస్తేనే పార్టీ ప్రతిష్ట పెరుగుతుందని ఆయన జాతీయ నాయకులకు నచ్చచెప్పినట్లు తెలుస్తోంది. వేలూరు, సౌత్ చెన్నై, రామనాథపురం, కన్నియాకుమారి, కోయంబత్తూరు, నీలగిరి, తిరుచ్చి సహా పది నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి అన్నామలై పావులు కదుపు తున్నారు. ఆ దిశగానే ఆయన పాద యాత్ర పేరుతో లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. 
 
ఈ నేపథ్యంలోనే ఖుష్బూను తిరుచ్చి లోక్‌సభ నియోజకవర్గంలో పోటీ చేయించడానికి రంగంసిద్ధమైంది. గత శాసనసభ ఎన్నికల్లో ఖుష్బూ చెన్నై థౌజండ్‌లైట్స్ నియోజకవర్గంలో ఓటమిపాలయ్యారు. ఈక్రమంలో తిరుచ్చి నుంచి పార్లమెంటుకు పోటీ చేయడానికి ఖుష్బూ ఆసక్తి కనబరుస్తున్నారు. ఖుష్బూ తిరుచ్చి నియోజకవర్గాన్ని ఎంచుకోవడం వెనుక బలమైన కారణం లేకపోలేదు. 
 
ఖుష్బూ తమిళ సినీ అగ్రశ్రేణి హీరోయిన్‌గా ఉన్నప్పుడే ఆమె వీరాభిమానులంతా కలిసి మండయూరు వద్ద ఆమె గుడి కూడా కట్టారు. వీరాభిమానులు అధికంగా ఉన్న తిరుచ్చి తన గెలుపునకు సహకరిస్తుందని ఖుష్బూ భావిస్తున్నారు. ఒక వేళ తిరుచ్చి నియోజకవర్గాన్ని కేటాయించకపోతే సౌత్ చెన్నై నియోజకవర్గంలో పోటీ చేసే అవకాశముందని పార్టీ నేతలు చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఖుష్బూ ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం మాత్రం తథ్యంగా మారింది.