డిశ్చార్జ్ కోసం మమతా బెనర్జీ పట్టు... తలొగ్గిన వైద్యులు...
గుర్తు తెలియని వ్యక్తుల దాడిలో స్వల్పంగా గాయపడిన వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ శుక్రవారం సాయంత్రం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
బుధవారం నందిగ్రామ్‌లో ఆమెపై జరిగిన దాడి అనంతరం ఆమె కోల్‌కతాలోని ఎస్ఎస్‌కేహెచ్ ఆసుపత్రిలో చేరారు. ఐదు రోజుల చికిత్స అనంతరం ఆమెను ఆసుపత్రి నుంచి విడుదల చేసినట్లు ఎస్ఎస్‌కేహెచ్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు.
నిజానికి మమతకు మరింత చికిత్స అవసరం ఉన్నప్పటికీ.. తనను డిశ్చార్జీ చేయాలని ఆమె పదే పదే కోరారని, ఆమె విజ్ణప్తి మేరకు డిశ్చార్జీ చేయాల్సి వచ్చిందని వైద్యులు వివరించారు.
ఇదే విషయంపై ఎస్ఎస్‌కేహెచ్ ఆసుపత్రి వైద్యులు స్పందిస్తూ, 'చికిత్సకు మమతా బెనర్జీ బాగా సహకరించారు. ఈరోజు సాయంత్రమే ఆమెను ఆసుపత్రి నుంచి విడుదల చేశాం. తనని డిశ్చార్జీ చేయాలంటూ ఆమె పదే పదే కోరారు. ఆమె విజ్ణప్తి మేరకు ఆసుపత్రి నుంచి డిశ్చార్జీ చేయాల్సి వచ్చింది. అయితే వారం రోజుల తర్వాత కొన్ని పరీక్షలకు ఆమె తిరిగి ఆసుపత్రికి రావాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని మమతా బెనర్జీకి వివరించాం' అని చెప్పుకొచ్చారు.
కాగా, వెస్ట్ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు 9 దశల్లో జరుగనున్న విషయం తెల్సిందే. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన అధికారాన్ని చేజిక్కించుకోవాలని కమలనాథులు బెంగాల్ రాష్ట్రంలో వరుస పర్యటనలు చేస్తున్నారు. అయితే, మమతా బెనర్జీ ఒక్కరే ధీరవనితా కమలనాథులపై పోరాటం చేస్తున్నారు.
మొన్నటి వరకు తన చెంతవున్న పార్టీ సీనియర్ నేతలు కొందరు బీజేపీ కండువా కప్పుకున్నప్పటికీ ఆమె ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. పైపైచ్చు... టీఎంసీ నుంచి బీజేపీలోకి వెళ్లి నందిగ్రామ్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న సువేందు అధికారిపైనే పోటీ చేస్తున్నారు. ఈ స్థానంలో నామినేషన్ వేయడానికి వెళ్లినపుడు మమతా బెనర్జీపై దాడి జరిగింది.