చిల్లర అడిగితే బస్సు నుంచి దించేశాడు.. 12కి.మీ నడిచిన విద్యార్థిని
కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం సమీపంలో ఓ విద్యార్థినికి చేదు అనుభవం ఏర్పడింది. ప్రభుత్వ బాలికల హయ్యర్ సెకండరీ పాఠశాలలో చదువుతున్న ఓ విద్యార్థిని సంఘటన జరిగిన రోజు తన ఇంటికి చేరుకోవడానికి నేదురుమంగడు డిపోలో ప్రభుత్వ బస్సు ఎక్కింది. అక్కడి నుంచి బస్సు బయలుదేరుతుండగా విద్యార్థిని కండెక్టర్‌కు వంద రూపాయలు ఇచ్చి టికెట్ తీసుకుంది.
విద్యార్థికి టికెట్ ఇచ్చిన కండక్టర్ చిల్లర ఇవ్వలేదు. తర్వాత ఇస్తానని చెప్పాడు. రెండు మూడుసార్లు అడిగినా కండక్టర్ విద్యార్థినికి చిల్లర ఇవ్వలేదు. ఆ విద్యార్థిని పదే పదే అడగడంతో ఆవేశానికి గురైన కండక్టర్ విద్యార్థిని దూషించి అవమానించాడు. అంతేగాకుండా విద్యార్థినిని బలవంతంగా బస్సు నుండి దించాడు. విద్యార్థిని వద్ద వేరే డబ్బు లేకపోవడంతో మరో బస్సులో ఇంటికి వెళ్లలేకపోయింది.
కన్నీళ్లతో సంఘటనా స్థలం నుంచి 12 కిలోమీటర్ల దూరం నడిచి ఇంటికి చేరుకుంది. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. అనంతరం విద్యార్థిని తండ్రి సంబంధిత బస్ డిపోకు వెళ్లి కండక్టర్‌ను నిలదీశాడు. దీంతో కండక్టర్ విద్యార్థిని తండ్రిని అనుచిత పదజాలంతో దూషించాడు. ఈ ఘటనపై యువతి తల్లిదండ్రులు ట్రాఫిక్ అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు.