శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 14 జనవరి 2019 (18:41 IST)

అమ్మాయిలకు సుప్రీం తీర్పు ఓ వరం : వివాహ బంధంతో ఒక్కటైన యువతులు

స్వలింగ సంపర్కం నేరం కాదంటూ గత యేడాది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అనేక మంది స్వలింగ సంపర్కులకువరంగా మారింది. ఫలితంగా లెస్బియన్లుగా ఉండే పలువురు అమ్మాయిలు, అబ్బాయిలు పెళ్లి బంధంతో ఒక్కటవుతున్నారు. తాజాగా భువనేశ్వర్‌లో ఇద్దరు అమ్మాయిలు పెళ్ళితో ఒక్కటయ్యారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఒడిషా రాష్ట్రంలోని కేంద్రపారా జిల్లాకు చెందిన ఇద్దరు యువతులు కటక్‌లో ఒకే స్కూల్‌లో చదువుతూ వచ్చారు. వీరిద్దరూ పాఠశాల బాల్యం నుంచే మంచి స్నేహితులుగా ఉంటూ వచ్చారు. ఆ తర్వాత వీరిద్దరి మధ్య శారీరక సంబంధం ఏర్పడి, అది ఎవరూ విడదీయలేనంతగా బలపడింది. 
 
తమ విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత తాము విడిపోకుండా ఉండాలని నిర్ణయించుకుని తమ మధ్య ఉన్న బంధాన్ని పెద్దలకు వివరించి పెళ్లి చేసుకోవాలన్న తమ మనసులోని మాటను వెల్లడించారు. కానీ, పెద్దల నుంచి వీరికి తీవ్ర వ్యతిరేక ఎదురైంది. పైగా, వీరిద్దరికీ వారివారి కుటుంబ సభ్యులు సంబంధాలు చూడటం మొదలు పెట్టారు. 
 
పెద్దల వైఖరిని ఏమాత్రం జీర్ణించుకోలేని వారు... పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని కోర్టును ఆశ్రయించారు. ఇద్దరు కలిసి తాము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్టు కోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేశారు. తమ మిగిలిన జీవితం, కలిసి కొనసాగిస్తామని, భవిష్యత్తులో ఎటువంటి గొడవలు జరిగినా వాటిపై ఫిర్యాదు చేయబోమని వారు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. దీన్ని విచారించిన కోర్టు గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ పెళ్లికి అనుమతిచ్చింది. దీంతో వీరిద్దరూ ఈనెల 12వ తేదీ శనివారం వివాహ బంధంతో ఒక్కటయ్యారు.