చరిత్ర సృష్టించిన ఆ ఇద్దరు మహిళల నేపథ్యమేంటి? (video)
సుప్రీంకోర్టు తీర్పు తర్వాత శబరిమల అయ్యప్పను దర్శించుకున్న రుతుక్రమ వయసులో ఉన్న తొలి ఇద్దరు మహిళలుగా బిందు, కనకదుర్గా నాయర్‌లు చరిత్ర సృష్టించారు. మంగళవారం రాత్రి (ఒకటో తేదీ) ఎర్నాకులం నుంచి బయలుదేరి బుధవారం తెల్లవారుజామున శబరిమల ప్రారంభ ప్రాంతమైన పంపానది దగ్గరకు చేరుకున్నారు. అక్కడ పోలీసుల రక్షణతో శబరిమలకు వెళ్లారు. బుధవారం (రెండో తారీఖు) వేకువజామున 3.45 గంటలకు ఆలయంలోకి అడుగుపెట్టి శ్రీ అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకున్నారు. ఇలా చరిత్ర సృష్టించిన ఈ ఇద్దరు మహిళల నేపథ్యాన్ని ఓసారి పరిశీలిస్తే...
కనకదుర్గా నాయర్ అనే మహిళ ఆ రాష్ట్ర సివిల్ సప్లయ్స్ కార్పొరేషన్‌లో ఉద్యోగి. ఆమె భర్త పేరు ఉన్ని కృష్ణన్. ఇంజనీర్‌గా పని చేస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మలప్పరంలో నివశిస్తూ ఓ మహిళా భక్తురాలిగా ఆలయంలోకి అడుగుపెట్టింది.
ఇక రెండో మహిళ బిందు. కన్నూర్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లీగల్ స్టడీస్‌లో ప్రొఫెసర్. చిన్నప్పటి నుంచీ బిందు రెబల్. కాలేజీ రోజుల్లో కేరళ విద్యార్థి సంఘటన (వామపక్ష విద్యార్థి సంఘం)నాయకురాలిగా పనిచేశారు. కేరళ యూనివర్సిటీలో న్యాయశాస్త్రంలో పీజీ డిగ్రీ పొందారు.
అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకునేందుకు ఎంతకైనా తెగిస్తుంది. స్త్రీపురుష సమానత్వం, సాంఘిక న్యాయ పోరాటాల్లో ముందున్నారు. ఈ అంశాలపై ఆమె ఇచ్చే ఉపన్యాసాలు వినడం కోసం కేరళలో విద్యార్థులు తండోపతండాలుగా తరలివస్తుంటారు. బిందు వ్యక్తిగత విషయానికి వస్తే ప్రముఖ పొలిటికల్ యాక్టివిస్ట్ హరిరన్ ఆమె భర్త. వాళ్లకు 11 యేళ్ల కుమార్తె ఓల్గా ఉండగా, వీరంతా కోజీకోడ్ జిల్లాలోని పోక్కాడ్‌లో నివశిస్తున్నారు.
అయితే, కనకదుర్గ, బిందులు ఎలా కలుసుకున్నారన్నదే ఇపుడు చర్చనీయాంశంగా మారింది. నిజానికి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ స్త్రీల ఆలయ ప్రవేశానికి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో వీరిద్దరూ అత్యంత రహస్యంగా తమ ప్రణాళికలు రూపొందించుకున్నారు.
ఇందుకోసం 'నవోథన కేరళం శబరిమలయిలెక్కు' అనే ఓ ఫేస్‌బుక్ ఖాతాను ప్రారంభించారు. ఇందులో అనేక మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. అలా బిందు, కనకదుర్గ ఒకరికొకరు పరిచయమయ్యారు. డిసెంబర్ 24వ తేదీన వీరిద్దరూ తొలిసారి ప్రయత్నించారు. కానీ, ఆలయంలో ఆడవాళ్లకు ప్రవేశం లేదు అని గట్టిగా నమ్మే వారి నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. అప్పటి నుంచి కుటుంబ సభ్యులతో రహస్యంగా ఉన్న వీరిద్దరూ ఈనెల ఒకటో తేదీన ప్రయత్నించి దైవదర్శనం చేసుకున్నారు.