1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 24 జూన్ 2019 (15:43 IST)

నీటి పన్ను చెల్లించని బీజేపీ ముఖ్యమంత్రి - డీఫాల్టర్‌గా ప్రకటించిన బీఎంసీ

ఆయనో రాష్ట్ర ముఖ్యమంత్రి. అదీ కూడా భారతీయ జనతా పార్టీ సీఎంగా ఉన్నారు. ఆయనకు ముఖ్యమంత్రి హోదాలో అధికారిక నివాసం కూడా ఉంది. కానీ, ఆ ఇంటికి నీటి పన్ను చెల్లించలేదు. దీంతో ఆయన్ను డీఫాల్టర్‌గా నగర పాలక సంస్థ ప్రకటించింది. 
 
ఇంతకీ ఆయన ఎవరన్నదే కదా మీ సందేహం. ఆయన ఎవరో కాదు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్. బీజేపీ చీఫ్ మినిస్టర్. ఆయన అధికారిక నివాసం దేశ వాణిజ్య రాజధాని ముంబైలో ఉంది. ఈయన నివాసం ఉంటున్న ఇంటికి నీటి పన్నుగా రూ.7,44,981 వచ్చింది. ఈ మొత్తం బకాయిగా ఉంది. దీంతో ఆయన్ను డీఫాల్టర్‌గా బాంబే నగర పాలక సంస్థ (బీఎంసీ) ప్రకటించింది. 
 
నీటి పన్ను చెల్లించనివారిలో ముఖ్యమంత్రి ఫఢ్నవిస్ మాత్రమే కాదండోయ్.. ఆయన మంత్రివర్గంలో పని చేస్తున్న మరో 18 మంది మంత్రులు కూడా ఉన్నారు. ఈ విషయం ఓ ఆర్టీఐ కార్యకర్త ద్వారా వెలుగులోకి వచ్చింది. ఆర్టీఐ ద్వారా అందిన సమాచారం మేరకు ముఖ్యమంత్రితో పాటు.. ఆయన కేబినెట్‌లోని మంత్రులు, రాజకీయ నేతలు, పలువురు కోటీశ్వరులు నుంచి రూ.8 కోట్ల మేరకు నీటి పన్ను బకాయిలు రావాల్సి ఉందని తేలింది. వీరిలో అందరికన్నా ముందు పేరు దేవంద్ర ఫడ్నవిస్‌ది కావడం గమనార్హం. 
 
కాగా, మహారాష్ట్రలో వచ్చే యేడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం ఫడ్నవిస్ రథయాత్ర చేపట్టనున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ ఉదంతం చర్చకు రావడం ఇపుడు చర్చనీయాంశమైంది. కాగా ఆర్టీఐ నుంచి వచ్చిన బీఎంసీ డిఫాల్టర్ల జాబితా విపక్షాలకు ఆయుధంగా మారనున్నదనే వాదన వినిపిస్తోంది.