శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 25 ఫిబ్రవరి 2021 (11:45 IST)

తప్పతాగి బాత్రూమ్‌లోపడి చనిపోయిన కొడుకు.. బతికున్నాడని రాత్రంతా తల్లి సేవలు...

మహారాష్ట్రలో ఓ విషాదకర ఘటన వెలుగు చూసింది. తప్పతాగడం వల్ల బాత్రూమ్‌లో పడిన కన్నబడ్డ ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయం తెలియని అతని తల్లి.. రాత్రంతా శవం పక్కనే కూర్చొని సపర్యలు చేసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ముంబై మహానగరంలోని కలినా ఏరియాకు చెందిన 42 ఏళ్ల వ్యక్తి సోమవారం తాగిన మైకంలో బాత్‌రూంలో జారికిందపడ్డాడు. దీంతో తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. 
 
కొద్దిసేపటి తర్వాత బాత్‌రూం దగ్గరకు వెళ్లిన తల్లి.. కుమారుడు కదలిక లేకుండా పడి ఉండటాన్ని గమనించింది. అనంతరం అతడ్ని(శవం)బయటకు లాక్కువచ్చింది. అతడు బ్రతికే ఉన్నాడని భావించింది. తల​కైన గాయానికి పసుపు రాయటం మొదలుపెట్టింది.
 
రాత్రంతా శవానికి సపర్యలు చేస్తూ కూర్చుంది. అయితే మరుసటి రోజు ఉదయం కూడా కుమారుడు లేవకపోవటంతో బంధువులకు విషయం చెప్పింది. దీంతో వారు అక్కడికి వచ్చి, పోలీసులకు సమాచారం అందించారు. 
 
పోలీసులు బాధితుడ్ని ఆసుపత్రికి తరలించగా.. అతడు చాలా సేపటి క్రితమే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ప్రాథమిక దర్యాప్తు మేరకు ప్రమాదవశాత్తు సంభవించిన మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.