మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 24 ఫిబ్రవరి 2021 (08:15 IST)

భార్య శీలాన్ని శంకించిన కలియుగ రాముడు .. సలసల కాగే నూనెలో...

దేశం అన్నిరంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. అయినప్పటికీ మనుషుల్లోని మూఢ నమ్మకాలు మాత్రం ఇంకా సమసిపోలేదు. దీంతో పలు ప్రాంతాల్లో జరుగుతున్న కొన్ని సంఘటనలు కంట కన్నీరుపెట్టిస్తున్నాయి. తాజాగా ఇంటి నుంచి వెళ్లిపోయి నాలుగు రోజుల తర్వాత తిరిగివచ్చిన భార్య శీలాన్ని కట్టుకున్న భర్త శంకించాడు. నాలుగు రోజుల తర్వాత ఇంటికి వచ్చిన భార్య పాతివ్రత్యాన్ని నిరూపించుకోవాలని భర్త కోరాడు. ఇందుకోసం సలసల కాగే నూనెలో రెండు చేతులు పెట్టే పరీక్ష పెట్టాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇపుడు తెలుసుకుందాం. 
 
మహారాష్ట్రలోని ఉస్మావాబాద్ జిల్లా పరాండలోని కచాపురి చౌక్‌లో నివసించే కారు డ్రైవర్, అతని భార్యకు ఫిబ్రవరి 11వ తేదీన గొడవ జరిగింది. భర్తపై కోపంతో ఆమె ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లింది. భార్య వెళ్లిపోయిన తర్వాత ఆమె కోసం డ్రైవర్ గాలింపు చేపట్టాడు. నాలుగు రోజులైనా ఆమె ఆచూకి లభించలేదు. ఐదో రోజు భార్యఫోన్ చేసి ఇంటికి వచ్చింది. అయితే ఇంటికొచ్చిన భార్య నాలుగు రోజులు ఎక్కడుందో… ఏమైందో అంతా వివరించింది.
 
గొడవపడి ఇంట్లోంచి వెళ్ళిపోయినరోజు కచాపురి చౌక్‌లో బస్సుకోసం వేచి ఉండగా… ఇద్దరు వ్యక్తులు వచ్చి బలవంతంగా బైక్‌‌పై తీసుకువెళ్లారని తెలిపింది. నాలుగురోజులు వారి వద్దే ఉంచుకున్నారని తనను ఏమీ చేయలేదని వివరించింది. ఆ తర్వాత వారిబారి నుంచి తప్పించుకుని ఇంటికొచ్చానని తెలిపింది.
 
అయినా ఆమె భర్త ఆ మాటలు నమ్మలేదు. భార్య శీలాన్ని శంకించాడు. తమ(పర్ది) సంప్రదాయం ప్రకారం భార్య పాతివ్రత్యాన్ని పరీక్షించాలను కున్నాడు. ఈ మేరకు సలసల కాగే నూనెలో అయిదు రూపాయల బిళ్లవేసి దాన్నిచేతితోతియ్యమని ఆదేశించాడు.
 
కాగే నూనెలో వేసిన నాణేన్ని చేతితోతీయటంతో భార్య చేతికి గాయాలయ్యాయి. ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ ఘటనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె నిజం చెపుతోందో అబధ్ధం చెపుతోందో తెలుసుకోవాలని అలా చేసినట్లు భర్త చెప్పాడు. తప్పు చేస్తే కాళ్లు చేతులు కాలిపోతాయని ఆయన చెబుతున్నాడు.
 
భర్త చేసిన తీరుపై మహిళా సంఘాలు, మేధావులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. భర్తపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై మహారాష్ట్ర శాసనమండలి ఛైర్‌పర్సన్ నీలమ్ గోర్హె ఆగ్రహం వ్యక్తం చేసారు. డ్రైవర్‌ను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.