బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 16 జనవరి 2020 (16:03 IST)

'ఆత్మ సమర్పణ్' చేసిన మావోయిస్టులకు పిల్లలు పుట్టిస్తున్న పోలీసులు.. ఎలా?

దేశంలో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఒకటి. ఇక్కడ మావోయిస్టుల దళంలో పని చేస్తున్న మావోలు లొంగిపోయి, ప్రజాజీవితం కొనసాగించేందుకు వీలుగా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆత్మ సమర్పణ్ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద అనేక మంది మావోలు లొంగిపోతున్నారు. అలా లొంగిపోయిన మావోయిస్టుల్లో 30 మందికి ఆ రాష్ట్ర పోలీసులు పిల్లలు పుట్టిస్తున్నారు. అదెలాగంటే.. లొంగిపోయిన మావోలకు వేసక్టమీ రీ ఓపెనింగ్ సర్జరీలు చేయిస్తున్నారు. ఇవి మంచి ఫలితం ఇవ్వడంతో పలువురు మావోలు తండ్రులుగా మారి, తమ భార్యాపిల్లలతో సంతోషంగా గడుపుతున్నారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, మహారాష్ట్రలోని గడ్చిరోలి పూర్తిగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతం. ఈ ప్రాంతంలో అనేక మందిని మావోయిస్టులు అంతం చేశారు కూడా. అయితే, మావోయిస్టులు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిపోయేందుకు వీలుగా మహారాష్ట్ర సర్కారు ఆత్మసమర్పణ్ పేరుతో ఓ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఫలితంగా గత యేడాది 34 మంది మావోయిస్టులు లొంగిపోయారు. 
 
వీరందరూ మావో దళంలో పని చేసే సమయంలో పిల్లలు పుట్టకుండా బలవంతంగా వేసెక్టమీ శస్త్రచికిత్సలు చేయించారు. లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం కల్పించడంతోపాటు వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపేందుకు పోలీసులు వారికి వేసక్టమీ రీ ఓపెనింగ్ సర్జరీలు చేయించారు. ఫలుతంగా పలురు మావోయిస్టులు పిల్లలకు తండ్రులయ్యారు. దీంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 
 
దీనిపై గడ్చిరోలి జిల్లా ఎస్పీ శైలేష్ బాలక్వాడ్ మాట్లాడుతూ, మాజీ మావోయిస్టులు వారి భార్యాపిల్లలతో సుఖంగా కుటుంబ జీవితం గడిపేందుకు వీలుగా తాము 30 మంది మాజీలకు వేసక్టమీ రీ ఓపెనింగ్ సర్జరీలు చేయించామని, వారిలో కొందరు ఇపుడు తండ్రులుగా మారారని చెప్పారు.