మహారాష్ట్రలో భూప్రకంపనలు : రిక్టర్ స్కేలుపై 3.4గా నమోదు
మహారాష్ట్రలో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఇవి పల్ఘర్ జిల్లాలో కనిపించాయి. దహను తాలుకాలోని దుండల్‌వాడి గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం నుంచి శనివారం తెల్లవారుజామువరకు మూడు సార్లు భూమి కంపించింది. ఆ గ్రామంలో భూమి కంపించిన మాట వాస్తవమేనని, ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని జిల్లా కలెక్టర్ డాక్టర్ కైలాష్ షిండే స్పష్టం చేశారు.
శనివారం తెల్లవారుజామున 5:22 గంటలకు భూమి కంపించగా, రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 3.9గా నమోదైంది. శుక్రవారం మధ్యాహ్నం 12:26 గంటలకు తొలిసారిగా భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి.
ఆ సమయంలో భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.2గా నమోదు కాగా, శుక్రవారం రాత్రి 9:55 గంటలకు రెండోసారి భూమి కంపించింది. ఈ సమయంలో భూకంప తీవ్రత 3.4గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. భూమి స్వల్పంగా కంపించడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు.