శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 26 ఫిబ్రవరి 2021 (13:24 IST)

గర్భిణి చితిలో బంగారం.. ఆ నలుగురు దొంగలు ఏం చేశారంటే?

గర్భిణి కాష్టంలోని బూడిదలో బంగారు నగల అవశేషాలను దొంగిలించడానికి ప్రయత్నించి నలుగురు నిందితులు అడ్డంగా దొరికిపోయారు. గ్రామస్తులు వారిని పట్టుకుని, దేహశుద్ధి చేసి పోలీసులకు పట్టించారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే..  సోలాపూర్‌ జిల్లా బర్లోని గ్రామానికి చెందిన దాదాసాహెబ్‌ హన్వంతే, రుక్మిణి, రామచంద్ర కస్బే, స్వాతిలు తమ ఉద్యోగాలు కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
 
ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 22న గ్రామానికి చెందిన ఓ గర్భిణి మరణించింది. అయితే, కుటుంబసభ్యులు ఆమె ఒంటిపై ఉన్న బంగారు నగలను అలాగే ఉంచి అంత్యక్రియలు చేయాలని నిర్ణయించారు. ఈ విషయం ఊరంతా తెలియడంతో నిందితులు నలుగురు ఆ నగలను కాజేసేందుకు ప్లాన్ చేశారు. గర్భిణి అంత్యక్రియల తర్వాత బూడిదలో నుంచి బంగారాన్ని దొంగిలించాలనుకున్నారు. అనుకున్నట్లుగానే బుధవారం అర్థరాత్రి మృతురాలి బూడిదలోని నగల కోసం వెళ్లారు.
 
అయితే, వారు బూడిదలో బంగారం కోసం వెతుకుతుండగా గ్రామస్తులు గమనించారు. అది చూసి పారిపోయేందుకు ప్రయత్నించిన నిందితులను వెంబడించి పట్టుకున్నారు. అందరూ కలిసి వారిని తీవ్రంగా కొట్టారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.