సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 21 జనవరి 2021 (16:55 IST)

కట్నం కోసం భార్యను వేశ్యగా మార్చాలనుకున్నాడు..

కట్నం కోసం ఓ ప్రబుద్ధుడు విభిన్న బాట పట్టాడు. తన భార్యనే ఏకంగా అమ్మకానికి పెట్టాడు. వేశ్యగా మార్చేందుకు ప్రయత్నించాడు. విటులకు ఫోన్ చేసి రప్పించి తన భార్యను వారి వద్దకు పంపించాలనుకున్నాడు. భార్య రివర్స్ కావడంతో అతడి బండారం బయటపడింది. చివరకు పోలీసులు అతడిని తమదైన స్టైల్లో విచారించి కేసు నమోదు చేసి కటకటాల్లోకి నెట్టారు.
 
మహారాష్ట్రలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఓ వ్యక్తికి కొన్నాళ్ల క్రితం పెళ్లయింది. పెళ్లి సమయంలో అనుకున్న విధంగా అత్తమామలు కట్నాన్ని పూర్తిగా ఇవ్వలేకపోయారు. ఆ తర్వాత పెద్దమనుషుల్లో పంచాయతీ పెడితే నెలకు పది వేల రూపాయలను ఇచ్చేట్టుగా ఒప్పుకున్నారు. 
 
వాటిని కూడా పేదరికం కారణంగా పంపించలేకపోవడంతో ఆ భర్త తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. నెల నెలా పది వేల రూపాయలను నువ్వే ఎలాగోలా ఇవ్వాలని భార్యను వేధించాడు. చిత్రహింసలు పెట్టాడు. ఆ తర్వాత తన నీచ బుద్ధిని కార్యరూపంలోకి తెచ్చాడు. 
 
భార్య ఫొటోలను మార్ఫింగ్ చేసి వేరొక వ్యక్తితో సన్నిహితంగా ఉన్నట్టు సృష్టించాడు. వాటిని చూపించి ఆమెను బెదిరించాడు. అదే సమయంలో ఆమెకు సంబంధించిన వివరాలను నెట్టింట పెట్టి విటులను ఆకర్షించాడు. కట్నం బాధలు తప్పాలంటే తాను చెప్పినట్టు వినాలని బెదిరించాడు. వేశ్యగా మారాలనీ, తాను చెప్పిన వారి వద్దకు వెళ్లి గడపాలని ఒత్తిడి తెచ్చాడు.
 
తాను ఆ పనిని చేయలేనని భార్య తేల్చిచెప్పడంతో ఆమెను చిత్రహింసలకు గురిచేశాడు. అతడి బాధలను తట్టుకోలేక ఆ భార్య స్థానికంగా ఉన్న ఘట్టికందన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు వచ్చి అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసి కటకటాల్లోకి నెట్టారు.