బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్

అనారోగ్యంతో మృతి చెందిన భార్య... శవాన్ని మోసుకెళ్లిన భర్త.. ఎక్కడ?

deadbody
ఆర్థిక, సాంకేతిక రంగాల్లో ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ.. ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు కనీసం అంబులెన్స్‌ను కూడా అందించలేని దుస్థితి మన దేశంలో నెలకొంది. అంబులెన్స్‌లు లేక తమ వారి మృతదేహాలను కుటుంబ సభ్యులు పదుల కిలోమీటర్ల మేరకు మోసుకెళుతున్న సంఘటనలు ఉన్నాయి. ఇలాంటి విషాదకర ఘటన ఒకటి ఒరిస్సా రాష్ట్రంలోని కోరాపుట్ జిల్లాలో జరిగింది. బిడ్డకు జన్మనిచ్చిన భార్య మృతి చెందింది. ఆమె మృతదేహాన్ని తన ఇంటికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ లేకపోవడంతో తన కుటుంబ సభ్యుల సాయంతో ఏకంగా 20 కిలోమీటర్లు మోసుకుని తీసుకెళ్లారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కోరాపుట్ జిల్లాకు చెందిన భర్త అభి అమానత్య కథనం మేరకు... ఈయన భార్య కరుణ (28) మూడు నెలల క్రితం ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి కోరాపుట్ జిల్లాలోని తన తల్లిగారి ఇంటి వద్దే ఉంటుంది. అయితే, ఆమె అనారోగ్యంతో శుక్రవారం రాత్రి మృతి చెందింది. దీంతో అంత్యక్రియలు మాత్రం తన ఇంట నిర్వహించాలని భావించిన భర్త.. భార్య మృతదేహాన్ని సొంతూరైన నవరంగ్ పూర్‌ జిల్లా నందహండి సమితి, జగన్నాథ్ పూర్ పంచాయతీ పుపుగావ్‌కు తీసుకెళ్లాలని నిర్ణయించాడు. 
 
ఇందుకోసం ఆయన అంబులెన్స్ కోసం ప్రయత్నించారు. మహాప్రాణ వాహనాలకు పలుమార్పు ఫోన్ చేసినా స్పందన లేదు. దీంతో ప్రైవేటు వాహనాల్లో తరలించేందుకు డబ్బులు లేకపోవడంతో శనివారం ఉదయం కరుణ మృతదేహాన్ని కుంటుంబ సభ్యుల సాయంతో 20 కిలోమీటర్ల మేరకు మోసుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ వార్త వెలుగులోకి వచ్చింది.