మలంద్వారంలో కేజీ బంగారం దాచి అక్రమ రవాణా..
కేరళలో ఓ విమాన ప్రయాణికుడి నుంచి దాదాపుగా కేజీకి పైగా బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మలద్వారంలో ఈ బంగారాన్ని దాచి అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించాడు. ఈ విషయాన్ని పసిగట్టిన కేరళ విమానాశ్రయ కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు.
నిందితుడు బంగారాన్ని నాలుగు క్యాప్సుల్స్‌లో నింపి.. మలద్వారంలో దాచుకొని తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కోజికోడ్ జిల్లా కొడువాలి ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి దోహా నుంచి బుధవారం కొచ్చి విమానాశ్రయానికి చేరుకున్నాడు. ఆ సమయంలో అతడి వ్యవహారశైలి అనుమానాస్పదంగా ఉండటంతో అధికారులు అదుపులోకి తీసుకుని సోదాలు చేపట్టారు.
ఈ తనిఖీల్లో బంగారం అక్రమ రవాణా చేస్తున్నట్లు తేలింది. అతడి నుంచి సుమారు 1066.75 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. మరోవైపు మహారాష్ట్రలోని ముంబైలో నాలుగు వేర్వేరు ఘటనల్లో సుమారు 15 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దీని విలువ సుమారు 7.87 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు.