గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 16 మే 2019 (09:16 IST)

అతిథులతో కలిసి డ్యాన్స్ చేసిందనీ.. భార్యను కడతేర్చిన భర్త

అతిథులతో కలిసి కట్టుకున్న భార్య డ్యాన్స్ చేయడం ఆ భర్తకు ఏమాత్రం నచ్చలేదు. దీంతో పశువుల పాకలోకి తీసుకెళ్లి ఊపిరాడకుండా చేసి చంపేశాడు కట్టుకున్న భర్త. ఈ దారుణం బీహార్ రాష్ట్రంలోని పాట్నా జిల్లా హసది ముషారి ప్రాంతంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఖోరంగ్‌పూర్‌ గ్రామానికి చెందిన రంజిత్‌ మాంఝీ భార్య మునియా దేవి హసదిలోని తన తల్లిదండ్రుల వద్దకు 10 రోజుల క్రితం వచ్చింది. వేసవి సెలవులు కావడంతో తన ఇద్దరు పిల్లలను కూడా తీసుకొచ్చింది. 
 
ఈ క్రమంలో అదే ఊరిలో ఓ వివాహానికి హాజరయ్యేందుకు ఆమె భర్త రంజిత్ మాంఝీ కూడా అత్తగారింటికి వచ్చాడు. ఆ తర్వాత భార్యాపిల్లలతో కలిసి వివాహ శుభకార్యానికి వెళ్లారు. ఈ శుభకార్యంలో డీజేకు అనుగుణంగా అతిథులతో కలిసి మునియా దేవి నృత్యం చేసింది. 
 
తన ముందే భార్య ఇలా చేయడం రంజిత్ వేయడం భర్త జీర్ణించుకోలేక పోయాడు. అందరి ఎదుటే భార్యను చితకబాదిన మాంఝీ ఆ తర్వాత ఆమెను పశువుల పాకలోకి తీసుకువెళ్లి ఊపిరాడకుండా చేసి ప్రాణం తీశాడు. ఘటనా స్థలంలోనే భార్య మునియా మరణించగా నిందితుడు పరారయ్యాడు. 
 
దీంతో పెళ్లి ఇంట విషాదం నెలకొంది. దీనిపై ఇరుగుపొరుగువారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. రంజిత్‌ను అరెస్టు చేశారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఆస్పత్రికి తరలించారు.