శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 26 ఫిబ్రవరి 2017 (13:50 IST)

తెలంగాణాలో "స్వచ్ఛ భారత్" అమలు భేష్... ప్రధాని మోడీ ప్రశంసలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసల వర్షం కురిపించారు. ఆదివారం జరిగిన మన్‌కీ బాత్‌లో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో స్వచ్ఛ భారత్ అమలు చేస్తున్న తీరు అద్భుతమన్నారు. అందరం కలిస్తేనే స్వ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసల వర్షం కురిపించారు. ఆదివారం జరిగిన మన్‌కీ బాత్‌లో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో స్వచ్ఛ భారత్ అమలు చేస్తున్న తీరు అద్భుతమన్నారు. అందరం కలిస్తేనే స్వచ్ఛ భారత్ సాధ్యమన్నారు. తెలంగాణలో మరుగుదొడ్ల నిర్మాణం భేష్ అన్నారు. 
 
స్వచ్ఛ భారత్, టాయిలెట్ల నిర్మాణంలో తెలంగాణ దూసుకెళ్తుందన్నారు. వరంగల్ జిల్లా గంగదేవిపల్లిలో గ్రామీణాభివృద్ధి శాఖ స్వచ్ఛత కార్యక్రమం నిర్వహించిందని గుర్తు చేశారు. స్వచ్ఛత కార్యక్రమంలో 23 రాష్ట్రాల నుంచి సీనియర్ అధికారులు పాల్గొన్నారని వెల్లడించారు. గంగదేవిపల్లిలో ప్రతి ఇంట్లో స్వచ్ఛత పాటిస్తున్నారని వెల్లడించారు. 
 
మరుగుదొడ్ల శుభ్రతలో అధికారులు పాల్గొంటే ప్రజలు ఎంతో ప్రభావితులవుతారన్నారు. స్వచ్ఛత, శుభ్రత కోసం ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నామని స్పష్టం చేశారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంపై ప్రజల్లో ఎంతో అవగాహన పెరిగిందన్నారు. స్వచ్ఛ భారత్‌లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారన్నారు. స్వచ్ఛతపై అవగాహన కల్పనకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నదని తెలిపారు. 
 
అలాగే, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) భారత ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిందని కొనియాడారు. మంగళ్‌యాన్ విజయం తర్వాత అంతరిక్షంలో ఇస్రో సరికొత్త చరిత్ర సృష్టించిందన్నారు. భారత శాస్త్రవేత్తలను ప్రపంచం కీర్తిస్తోందన్నారు. ఒకేసారి 104 ఉపగ్రహాలు ప్రయోగించిన తొలి దేశంగా భారత్ అవతరించిందన్నారు. ఇస్రో శాస్త్రవేత్తలను చూసి యువత స్ఫూర్తి పొందాలన్నారు. 
 
భారత్ తన బాలిస్టిక్ ఇంటర్‌సెప్టర్ క్షిపణిని ఒడిశా తీర ప్రాంతం నుంచి విజయవంతంగా ప్రయోగించిందని తెలిపారు. మానవ జీవితంలో శాస్త్ర, సాంకేతిక అంశాలు ఎంతో ప్రాధాన్యమన్నారు. యువతలో శాస్త్ర, సాంకేతిక నైపుణ్యాలు పెరగాల్సిన అవసరం ఉందన్నారు. దేశానికి మరింత మంది శాస్త్రవేత్తలు అవసరమన్నారు. 
 
నగదు రహిత లావాదేవీల ఉద్యమంలో ప్రజలంతా భాగస్వాములవుతున్నారని తెలిపారు. నగదు రహిత లావాదేవీలు నిర్వహించిన వారికి ప్రోత్సాహకాలు ఇస్తున్నామని చెప్పారు. ప్రోత్సహకాలు పొందిన వారిలో 15 ఏళ్ల నుంచి 65 ఏళ్ల వయసున్న వారు ఉన్నారని ప్రధాని చెప్పుకొచ్చారు. సమాజం మొత్తం క్రమంగా సాంకేతిక మార్గం వైపు వెళ్తుందన్నారు. ప్రజల ప్రోత్సహంతో నగదు రహిత లావాదేవీలు పెరుగుతున్నాయని తెలిపారు.