ఆటోపైన మినీ గార్డెన్‌తో ఏసీ ఫీలింగ్ తెప్పిస్తున్నాడు..ఎక్కడ?
ఈ వేసవిలో హీట్‌ను బీట్ చేయడానికి ఓ ఆటో డ్రైవర్ వినూత్న పద్ధతిని ఎంచుకున్నాడు. అద్భుతమైన ప్లాన్‌తో దేశాన్ని మొత్తం ఆశ్చర్యపరిచాడు. తాను నడిపే ఆటోపై ఓ మినీ గార్డెన్‌ని ఏర్పాటు చేసి అందరి మన్నలను అందుకుంటున్నాడు. చుట్టుపక్కల వారందరూ అతడిని వాట్ ఏ ఐడియా గురూ అంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
కొందరు ఆటో డ్రైవర్‌లు మాత్రం ఈ ఐడియా తమకు రాలేదంటూ తెగ ఫీలవుతున్నారు. ఈ ఆటోలో ప్రయాణించిన పలువురు ప్రయాణికులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ..ఏసీలో ప్రయాణించిన అనుభూతి కలిగిందంటూ చెప్తున్నారు. మరికొంత మంది ప్రయాణికులైతే సర్వీస్ ఛార్జీ కంటే పది రూపాయలు ఎక్కువ ఇచ్చేందుకు కూడా వెనకాడడం లేదు.
కోల్‌కతాకు చెందిన బిజయ్ పాల్ అనే ఆటో డ్రైవర్ మండే ఎండాకాలంలో ఆటోను ఎన్ని గంటలైనా నడిపేందుకు సిద్ధం అంటున్నాడు. బిజయ్ తన ఆటోపై ఓ గార్డెన్‌ని ఏర్పాటు చేసాడు. కేవలం ప్లెయిన్ గ్రాస్ మాత్రమే కాకుండా చిన్న చిన్న చెట్లు, పొదలు కూడా ఊ రూఫ్‌టాప్ గార్డెన్‌లో ఉన్నాయి. ఈ గార్డెన్ పట్ల బిజయ్ చాలా కేర్ తీసుకుంటున్నాడు.
తాను సంపాదించే దానిలో అధిక మొత్తం ఈ గార్డెన్ సంరక్షణ కోసమే ఖర్చు చేస్తున్నాడు. ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఆ చెట్లకు నీళ్లు పోస్తాడు. గ్రీన్ కలర్‌లో ఉన్న ఈ ఆటోకి నెటిజన్లు గ్రీన్ ఆటోగా పేరు పెట్టారు. ఈ గ్రీన్ ఆటో ఎల్‌పీజీ సాయంతో నడుస్తూ పూర్తి పర్యావరణ హితంగా ఉంది.
అంతేకాకుండా పర్యావరణ ప్రేమికుడైన ఈ ఆటో డ్రైవర్ రూఫ్‌టాప్ గార్డెన్ కింద బెంగాలీ భాషలో చెట్లను కాపాడుకుందాం..ప్రాణాలు రక్షించుకుందాం అని రాసాడు. ఈ ఆటోకి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.