కొబ్బరి నూనెకి వాల్‌నట్ పొడిని కలిపి..?
మనం తీసుకునే ఆహారమే చర్మాన్ని సంరక్షిస్తుంది. చర్మం కాంతివంతంగా ఉండడానికి పలు ఆహార పదార్థాలు తోడ్పడతాయి. నూనె పదార్థాలు, కొవ్వు పెంచే పదార్థాలు, మత్తు పదార్థాలు చర్మానికి హాని కలిగిస్తాయి. అందువలన వీలైనంత వరకు వాటికి దూరంగా వుండాలి. ఇక ఆకుకూరలు, పండ్లు, పాలు, మొక్కజొన్న, సోయా చిక్కుళ్లు వంటివి తరచు తీసుకోవడం చర్మానికి మంచిది. ఇంకా సహజసిద్ధంగా ఇంట్లో ఉండే సున్నిపిండి, సెనగపిండి, పాలు, కమలా, బత్తాయి తొక్కల పౌడరు వంటివి చర్మాన్ని కాంతివంతంగా చేస్తాయి.
సబ్బు కన్నా వివిధ సహజ మూలికలతో తయారుచేసిన సున్నిపిండి వాడడం మంచిది. శరీరానికి చల్లటి, స్వచ్ఛమైన గాలి, నిత్యం కాసేపైనా తగలనివ్వాలి. వేసవిలో బిగుతైన దుస్తులు కాకుండా, కాస్త గాలి ఆడే దుస్తులు ధరించాలి. అవి కూడా నూలుతో చేసినవై ఉండాలి.
నిత్యం వీలైనంత ఎక్కువగా నీరు సేవించాలి. ఇది కేవలం చర్మానికే కాకుండా, ఆరోగ్యానికి కూడా మంచిది. చెమట ఎక్కువగా పట్టే వారు స్నానానంతరం కాస్త చందనాన్ని నీళ్లలో కలిపి, పల్చగా చేసి శరీరానికి పట్టించడం మంచిది. నూనె పదార్థాలకు దూరంగా ఉంటే ముఖంపై చర్మం కాంతివంతంగా ఉంటుంది. జిడ్డు చేరదు. జిడ్డు చర్మం కలిగిన వారు రోజుకు నాలుగైదు సార్లు, స్వచ్చమైన మంచి నీటితో ముఖాన్ని కడగడం అవసరం.
నిమ్మ రసంతో మోచేతులు, మోకాళ్ల వద్ద రుద్దితే నల్లటి చారలుండవు. ఇలా వారానికి రెండుసార్లైనా చేయాలి. అలాగే ఒక స్పూన్ కొబ్బరి నూనెకి, అరస్పూన్ నిమ్మరసం కలిపి జాయింట్ల దగ్గర రుద్ది, వేడి టవల్‌తో తుడిచేయాలి. ఇలా ప్రతీ వారం చేయాలి. కొబ్బరి నూనెకి వాల్‌నట్ పొడిని కలిపి తరచూ రాస్తున్నా మంచి ఫలితమే ఉంటుంది. మీగడకి, పసుపు కలిపి స్క్రబ్‌లా రోజూ వాడొచ్చు. చర్మం నలుపు తగ్గి నునుపుగా మారుతుంది. 2 స్పూన్ల పెరుగుకి కొద్దిగా బాదం పొడిని కలిపి రాసుకున్నా చర్మం తెల్లగానూ, మృదువుగా తయారవుతుంది.