శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సందీప్
Last Updated : గురువారం, 4 ఏప్రియల్ 2019 (14:23 IST)

వేసవి కాలం వచ్చేసింది.. డయేరియాతో తస్మాత్ జాగ్రత్త...

వేసవి కాలం వచ్చేసింది. ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 8 గంటల నుండి భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. సాయంత్రం 7 అయినా వేడి తగ్గడం లేదు. వేసవి కాలంలో చాలా రోగాలు వ్యాపిస్తాయి. ఈ కాలంలో అత్యంత తరచుగా వచ్చే వ్యాధి అతిసార. ఇది వస్తే మనిషి శరీరంలో సత్తువ చచ్చిపోతుంది. నిరసంగా డీలాపడిపోతారు. జాగ్రత్త వహించకపోతే ప్రాణానికి కూడా ముప్పు వస్తుంది. నీటి ద్వారా వ్యాపించే ఈ వ్యాధి వేసవి కాలంలోనే ఎక్కువగా రావడానికి కారణం కలుషిత నీరుని సేవించడం. 
 
ఆంగ్లంలో ఈ వ్యాధిని డయేరియా అంటారు. పట్టణాలు, నగరాల్లోనే కాక, చిన్న చిన్న గ్రామాలలో కూడా ఇది వ్యాపిస్తుంది. రోటా వైరస్ వలన ఈ వ్యాధి వస్తుంది. ఈ అనారోగ్యం వలన శారీరకంగానే కాక మానసికంగా కూడా నిస్తేజమైపోతారు. ఈ వ్యాధి సోకిందని నిర్ధారించడానికి ముఖ్య లక్షణం విరేచనాలు. విరేచనాలలో రక్తం కూడా పడితే అదే డీసెంట్రి. గాలిలోను, నీటిలోను, ఆహార పదార్ధాలలోనూ ఉండే ప్రోటోజోవా, బ్యాక్టీరియా, వైరస్ వలన వస్తుంది. 
 
రోజుకు మూడు కంటే ఎక్కువ సార్లు పలుచగాను, జిగటగానూ విరేచనాలు అయితే దానిని అతిసారగా అనుమానించాలి. వెంటనే డాక్టర్‌ని సంప్రదించడం మంచిది. దీని వలన వచ్చే వాంతులు, విరేచనాల వలన శరీరంలోని సారమంతా బయటకు వెళ్లిపోతుంది. ఈ రెండిటితో పాటు జ్వరం కూడా వస్తుంది. అయితే, ఈ జ్వరం చాలా తక్కువ ఉష్ణోగ్రతలో ఉంటుంది. ఒకవేళ అతిసార కాస్త డీసెంట్రి అయితే, అన్నం రుచించకపోవడం, రక్త విరేచనాలు, వాంతులు ప్రధాన లక్షణాలు. పెద్ద వాళ్లకి ఈ వ్యాధి సోకితే రెండు మూడు రోజుల్లో నయం అవుతుంది. 
 
చిన్నపిల్లలకి 5 నుండి 7 రోజులు పడుతుంది. వ్యాధి తీవ్రమైతే పదిహేను రోజులు పట్టవచ్చు. వ్యాధి నిర్ధారించడానికి పరీక్షలు అవసరమైనా, ఇంట్లోనే సులువుగా తెలిసిపోతుంది. వెంటనే రక్త పరీక్షలు చేయించుకోవాలి. ఈ వ్యాధికి డాక్టర్లు ఇచ్చే మందుల కంటే ఇంట్లో వారే ఎక్కువ శ్రద్ధ చూపించాల్సి ఉంటుంది. అతిసార సోకిన వారికి రోజుకు కనీసం నాలుగైదు సార్లు ఉప్పు, పంచదార కలిపిన నీరు తాగించాలి. పాలు కలపని సగ్గుబియ్యం జావ పట్టించాలి. రోగి వికారం కారణంగా నోటి ద్వారా ద్రవ పదార్ధాలను తీసుకోవడం కష్టం అయితే, సెలైన్‌ ఎక్కిస్తే చాలా మేలు. ముఖ్యంగా ఈ అతిసార వ్యాధి వచ్చిన వారు ఎక్కువ విశ్రాంతి తీసుకోవాలి.