మంగళవారం, 21 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 13 మే 2022 (18:01 IST)

May 27 కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు

 Monsoon
నైరుతి రుతుపవనాలు ముందుగానే ప్రవేశించే అవకాశం ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది. ఈనెల 15 తేదీన దక్షిణ అండమాన్‌, ఆగ్నేయ బంగాళాఖాతంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది.  కేరళను మే 27న ఈ రుతుపవనాలు తాకే అవకాశం వుంది. 
 
ఇక కేరళ దాకా వస్తే తెలుగు రాష్ట్రాల సమీపంలోకి రుతుపవనాలు వచ్చినట్లుగానే భావిస్తారు. కేరళ నుంచి తెలంగాణకు చేరడానికి ఐదారు రోజుల సమయం పడుతుంది. అంటే జూన్‌ మొదటి వారంలో, సాధారణ నైరుతి ఆగమన తేదీ (జూన్‌ 8) కన్నా ముందుగానే రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశాలున్నాయి. 
 
గత రెండేళ్లుగా రాష్ట్రంలో అధిక వర్షపాతమే నమోదైంది. నిరుడు సకాలంలో (జూన్‌ 5)నే తెలంగాణలోకి రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ.. గాలుల దిశ మారడంతో జూన్‌లో సరిగా వర్షాలు పడలేదు. బంగాళాఖాతంలో అల్పపీడనాలు, ఉపరితల ఆవర్తనాలు ఏర్పడలేదు. అందుకే తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు మినహా జూన్‌లో భారీ వర్షాలేమీ కురవలేదు.
 
ఆ తర్వాత రుతు పవనాలు కుదురుకోవడంతో జూలై, ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో వర్షాలు దంచికొట్టాయి. ఈసారి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించిన తర్వాత దిశ మారేందుకు అవకాశాలు తక్కువగా ఉన్నాయని, స్థిరంగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు.