శనివారం, 9 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 27 జులై 2022 (18:22 IST)

వృద్ధుడికి కరెంట్ బిల్లుతో షాక్ - నెలవారీ బిల్లు రూ.3149 కోట్లు

power grid
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్‌లో ఓ వృద్ధుడు కరెంట్ బిల్లు చూడగానే కరెంట్ షాక్‌కు గురైనట్టుగా అస్వస్థతకు గురయ్యాడు. ఆయనకు వచ్చిన నెలవారీ బిల్లును చూసిన దేశ ప్రజలు సైతం విస్తుపోతున్నారు. చిన్నపాటి ఇంటిలో ఉండే ఆ వృద్ధుడి ఇంటికి ఏకంగా రూ.3,149 కోట్ల మేరకు విద్యుత్ బిల్లు వచ్చింది. దీన్ని చూసిన ఆయన నోరెళ్ళబెట్టారు. ఈ బిల్లు విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యానికి సాక్షీభూతంగా నిలిచింది. 
 
బాధిత కుటుంబ సభ్యులు వెల్లడించిన వివరాల మేరకు... గ్వాలియర్‌లోని శివ్ విహార్ కాలనీలో ప్రియాంకా గుప్తా అనే కుటుంబ నివాసం ఉంటుంది. వీరికి జూలై నెల కరెంట్ బిల్లు వచ్చింది. దాన్ని చూడగానే ప్రియాంకా గుప్తా మామ వృద్ధుడు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. నిజంగానే అస్వస్థతకు గురికావడంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. 
 
ఈ బిల్లును చూడగానే ఆయన అనారోగ్యానికి గురయ్యారు. ఆ తర్వాత ఆ బిల్లును తీసుకెళ్లి విద్యుత్ శాఖ అధికారులకు చూపించగా, వారు చేసిన తప్పును తెలుసుకుని సరిదిద్దారు. దీనిపై మధ్యప్రదేశ్ విద్యుత్ శాఖా మంత్రి ప్రధుమన్ సింగ్ తోమర్ స్పందించారు. ఈ తప్పు చేసిన ఉద్యోగిని గుర్తిస్తామని తెలిపారు.