శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 22 ఫిబ్రవరి 2021 (16:23 IST)

హోటల్ గదిలో విగతజీవిగా కనిపించిన లోక్‌సభ సభ్యుడు

ముంబైలోని ఓ హోటల్ గదిలో లోక్‌సభ సభ్యుడు ఒకరు శవమై కనిపించాడు. ఆయన పేరు మోహన్ దేల్కర్. దాద్రా అండ్ నగర్ హవేలీ లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 
 
దేశ ఆర్థిక రాజధాని ముంబై మెరైన్ డ్రైవ్ ప్రాంతంలో ఉన్న సీ గ్రీన్ సౌత్ హోటల్ గదిలో ఆయన విగతజీవుడిగా పడివుండడాన్ని గుర్తించారు. ఆయన ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. 
 
కాగా, హోటల్ గదిలో గుజరాతీ భాషలో ఉన్న సూసైడ్ నోట్ లభ్యమైనట్టు తెలుస్తోంది. సిల్వస్సా ప్రాంతంలో ఓ వ్యవసాయదారుల కుటుంబంలో జన్మించిన మోహన్ దేల్కర్ రాజకీయాల్లో విశేష ప్రభావం చూపించారు. మోహన్ దేల్కర్ ఏడు పర్యాయాలు ఎంపీగా గెలిచారు. 2019 ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీని వీడారు. 
 
ప్రస్తుతం ఆయన స్వతంత్ర ఎంపీగా ఉన్నారు. గతేడాది దాద్రా నగర్ హవేలిలో స్థానిక ఎన్నికల కోసం జేడీయూతో పొత్తు పెట్టుకున్నారు. 58 ఏళ్ల మోహన్ దేల్కర్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన ఆత్మహత్యకు గల కారణాలన తెలియరాలేదు. కుటుంబ సమస్యల కారణంగా ఆత్మహత్య చేసుకున్నారా? లేక ఇతరాత్రా కారణాల రీత్యా సూసైడ్ చేసుకున్నారా అనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.