1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 29 జూన్ 2021 (09:46 IST)

30 రోజుల్లో 2170 పడకల కోవిడ్ ఆస్పత్రి.. ముంబై రికార్డు

ముంబై అధికార యంత్రాంగం సరికొత్త రికార్డును నెలకొల్పింది. కేవలం 30 రోజుల్లో 2170 పడకల సామర్థ్యంతో కూడిన భారీ కోవిడ్ కేంద్రాన్ని నెలకొల్పింది. కరోనా మూడో దశను ఎదుర్కొనేందుకు సన్నద్ధం కావడంతో పాటు, మరిన్ని మౌలిక వసతుల కల్పన లక్ష్యంగా, కేవలం 35 రోజుల్లోనే ముంబైలో ఈ ఆసుపత్రి నిర్మితం కావడం గమనార్హం. 
 
మలాడ్ సమీపంలో, జర్మనీ సాంకేతిక పరిజ్ఞానంతో ఇది నిర్మితమైంది. ఈ ఆసుపత్రి అగ్ని ప్రమాదాలను ఎదుర్కోవడంతో పాటు పర్యావరణానికి స్నేహపూర్వకమని అధికారులు తెలిపారు. ఇక ఈ ఆసుపత్రి ప్రత్యేకతలను పరిశీలిస్తే, 70 శాతం బెడ్లకు నిరంతర ఆక్సిజన్ సరఫరా ఉంటుంది. 
 
384 పడకల ఐసొలేషన్ రూమ్, 42 ఐసీయూ బెడ్లు, మరో 20 డయాలసిస్ బెడ్లు ఉంటాయి. భద్రతా చర్యల నిమిత్తం 200 సీసీ కెమెరాలను కూడా ఇందులో అమర్చారు. ముంబై డెవలప్ మెంట్ ఆధారిటీ (ఎంఎంఆర్డీయే) ఆధ్వర్యంలో నిర్మితమైన ఈ ఆసుపత్రిని రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే సమక్షంలో ఉన్నతాధికారులు బీఎంసీకి అంకితం చేశారు. 
 
ఈ కేంద్రాన్ని ప్రపంచ స్థాయి నాణ్యతా ప్రమాణాలతో నిర్మించడం తనకెంతో ఆనందాన్ని కలిగించిందని ఈ సందర్భంగా ఉద్ధవ్ వ్యాఖ్యానించారు. కరోనాతో అత్యధికంగా ప్రభావితమైన రాష్ట్రాల్లో మహారాష్ట్ర ముందు నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ రాష్ట్రంలో 60 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా, సుమారు 1.2 లక్షల మందికి పైగా మరణించారు.