ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 24 జూన్ 2021 (10:08 IST)

ఐసీయు వార్డులోని రోగిని కరిచి చంపిన ఎలుకలు.. ఎక్కడ?

దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో దారుణం జరిగింది. ఐసీయూ వార్డులో చికిత్స పొందుతూ వచ్చిన ఓ రోగిని ఎలుకలు కరిచి చంపేశాయి. ఘాట్కోపర్‌లో బృహ‌న్ ముంబై కార్పొరేష‌న్‌కు చెందిన రాజావాడి ఆస్పత్రిలో ఈ దారుణం జరిగింది. ఆస్ప‌త్రి ఐసీయూలో వెంటిలేట‌ర్‌పై ఉన్న రోగిని ఎలుక‌లు కొరికి చంప‌డం తీవ్ర‌ క‌ల‌క‌లం రేపింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కుర్లా కమానీ ప్రాంతానికి చెందిన శ్రీనివాస్‌ ఎల్లప్ప (24) శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండ‌టంతో కుటుంబసభ్యులు రెండు రోజుల కిందట రాజావాడి ఆస్పత్రికి తీసుకొచ్చారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు మెదడువాపు, కాలేయానికి సంబంధించిన సమస్యలు ఉన్నాయ‌ని చెప్పి ఐసీయూలో చేర్పించి చికిత్స మొద‌లుపెట్టారు. 
 
మంగళవారం ఉదయం శ్రీనివాస్‌ కంటి కింది భాగం నుంచి రక్తస్రావం జరుగుతున్నట్లు రోగి సోద‌రి గమనించింది. వెంటనే విష‌యాన్ని ఆమె త‌న బంధువుల‌కు చెప్ప‌డంతో వారు ఆస్పత్రి సిబ్బందిని నిల‌దీశారు. దాంతో ఎలుక క‌ర‌వ‌డంతో గాయం అయ్యింద‌ని, దానివ‌ల్ల పెద్ద ప్ర‌మాదం ఏమీ లేద‌ని చెప్పారు. 
 
కానీ 24 గంట‌లు కూడా గ‌డువ‌క‌ముందే బాధితుడు ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి బంధువులు ఈ ఘ‌ట‌న‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు. ఆస్ప‌త్రి ముందు ధ‌ర్నాకు దిగారు. ఏకంగా ఆస్ప‌త్రి ఐసీయూలో ఎలుకలు దూరడంతోపాటు.. బెడ్‌పై చికిత్స పొందుతున్న రోగిని కొరికి చంప‌డం యాజ‌మాన్యం నిర్లక్ష్యానికి అద్దం పడుతున్న‌ద‌ని మండిప‌డ్డారు. 
 
కాగా, ఈ ఘటనను బీఎంసీ పరిపాలనా విభాగం సీరియస్‌గా తీసుకున్నదని, ఘ‌ట‌న‌పై స‌మ‌గ్ర దర్యాప్తునకు ఆదేశాలు జారీచేశామ‌ని ముంబై మేయర్‌ కిశోరీ పెడ్నేకర్ చెప్పారు.
 
ఇదిలావుంటే, నాలుగేళ్ల క్రితం కాందివలిలోని శతాబ్ధి ఆస్పత్రిలో కూడా ఇలాగే ఓ రోగి ముఖాన్ని ఎలుకలు కొరికేశాయి. ఆ త‌ర్వాత‌ మార్చురిల్లో కూడా ఎలుక‌లు శవాలను గుర్తుపట్టలేనంతగా కొరిన సంఘటనలు అనేకం వెలుగులోకి వచ్చాయి. అయినప్పటికీ బీఎంసీ, ప్రభుత్వ ఆస్ప‌త్రుల్లో మార్పు రాకపోకడంపై రోగుల బంధువులు అసహనం వ్యక్తంచేస్తున్నారు.