పబ్జీ ఆడొద్దని అడ్డుకున్న తల్లిని కాల్చి చంపేశాడు.. 3 రోజులు మృతదేహంతో..?
ఆన్‌లైన్ గేమ్స్ ఆ యువకుడిని కిరాతకుడిగా మార్చింది. యూపీలోని లక్నోలో పబ్జీ ఆడేందుకు అనుమతించలేదనే కోపంతో 16 ఏళ్ల కుర్రాడు తన తల్లిని కాల్చి చంపాడు. ఆ తర్వాత తల్లి మృతదేహంతో మూడు రోజుల పాటు ఇంట్లోనే ఉన్నాడు.
10 ఏళ్ల సోదరిని కూడా బెదిరించి ఇంటి నుంచి బయటకు వెళ్లనీయకుండా చేశాడు. మృతదేహం కుళ్లిపోయి, దుర్వాసన రావడంతో ఆ కుర్రాడు తండ్రికి ఫోన్ చేసి, తల్లి హత్యకు గురైందని చెప్పాడు. తండ్రి సమాచారం మేరకు పోలీసులు మృతదేహాన్ని ఇంట్లో నుంచి బయటకు తరలించారు.
వివరాల్లోకి వెళితే.. వారణాసికి చెందిన నవీన్ కుమార్ సింగ్ ఆర్మీలో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్. అతని పోస్టింగ్ పశ్చిమ బెంగాల్‌లో ఉంది. అతనికి లక్నోలోని పీజీఐ ప్రాంతంలోని యమునాపురం కాలనీలో ఇల్లు ఉంది. దానిలో అతని భార్య సాధన (40) వారి 16 ఏళ్ల కుమారుడు, 10 ఏళ్ల కుమార్తెతో ఉంటున్నారు. మంగళవారం రాత్రి కొడుకు తన తండ్రి నవీన్‌కు వీడియో కాల్ చేసి తల్లిని చంపేశారని చెప్పాడు.
మృతదేహాన్ని కూడా తండ్రికి చూపించాడు. వెంటనే నవీన్ తమ బంధువుకు ఫోన్ చేసి ఇంటికి పంపించాడు. పోలీసులు అక్కడికి చేరుకోగానే ఇంట్లోని పరిస్థితిని చూసి కంగుతిన్నారు. ఏడీసీపీ కాశీం అబ్ది తెలిపిన వివరాల ప్రకారం.. కొడుకు మొబైల్‌లో గేమ్‌లు ఆడేవాడని, అయితే తల్లి సాధన అతడిని గేమ్ ఆడకుండా అడ్డుకునేదని తెలిపారు. అందుకేన తల్లిని చంపేశాడని తేలింది.
శనివారం రాత్రి 2 గంటల ప్రాంతంలో సాధన గాఢనిద్రలో ఉన్న సమయంలో అల్మారాలోంచి తండ్రి పిస్టల్ తీసి తల్లిపై కాల్పులు జరిపాడు.
సాధన మృతదేహం దగ్గర నవీన్ లైసెన్స్‌డ్ పిస్టల్‌ను పోలీసులు గుర్తించారు. పిస్టల్ మ్యాగజైన్ పూర్తిగా ఖాళీగా ఉంది. తల్లిపై కొడుకు ఆరు మ్యాగజైన్ బుల్లెట్లు కాల్చాడని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.